లై డిటెక్టర్ టెస్ట్‌కు ఏర్పాట్లు చేస్తాం.. కేటీఆర్ సవాలుపై స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

భార్యాభర్తలు, న్యాయమూర్తులకు వచ్చిన ఫోన్లను కూడా కేటీఆర్ విన్నారని ఆరోపించారు.

Adi Srinivas-KTR

తెలంగాణలో కలకలం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని చెప్పిన మాజీ మంత్రి కేటీఆర్ దీనిపై లై డిటెక్టర్, నార్కో టెస్ట్‌కు సిద్ధమని తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. కేటీఆర్ నిజంగానే లై డిటెక్టర్ టెస్ట్‌కి రెడీగా ఉంటే తాము ఏర్పాట్లు చేస్తామని ఆది శ్రీనివాస్ తెలిపారు.

కేటీఆర్ సమయం, ప్రాంతం చెబితే టెస్ట్ కి అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. మాదక ద్రవ్యాల విషయంలో రేవంత్ రెడ్డి సవాలు విసిరి.. అప్పట్లో గన్ పార్క్ కు వస్తే కేటీఆర్ మాత్రం అడ్రస్ లేకుండా పారిపోయారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో నిజాలు బయటపడుతుంటే కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.

భార్యాభర్తలు, న్యాయమూర్తులకు వచ్చిన ఫోన్లను కూడా కేటీఆర్ విన్నారని ఆరోపించారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని అన్నారు. తననా ఫోన్ ట్యాప్ అవుతోందని రేవంత్ రెడ్డికి ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే చెప్పానని తెలిపారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని కేటీఆర్ ఇంకోసారి మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ తహతహలాడిందని చెప్పారు.

కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తనను బీఆర్ఎస్ లోకి రవాలని ఇబ్బంది పెట్టారని తెలిపారు. తన ఫోన్ ట్యాప్ అయిందని ఫిర్యాదు ఇవ్వగానే కేటీఆర్ కి పూనకం వచ్చిందని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం తాను ఫిర్యాదు ఇస్తే అది పరువునష్టం ఎలా అవుతుందని నిలదీశారు. కేటీఆర్ ఇచ్చిన నోటీస్ చట్టానికి విరుద్ధంగా ఉందని తెలిపారు.

 Also Read: 17సీట్లను గెలిచి టీపీఎల్ క‌ప్‌ను గెలవబోతున్నాం : బండి సంజయ్

ట్రెండింగ్ వార్తలు