Adilabad
Adilabad: నిత్యావసరాల సరుకులు కావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రేవు దాటాలి. ఉప్పు, పప్పు కొనుక్కోవాలంటే ముందు ప్రాణాలు పణంగా పెట్టాలి. రోగమొచ్చి ఆసుపత్రికి వెళ్లాలంటే ముందు వాగు ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఒడ్డుకు చేరాలి. ఆకాశానికి, ఇతర గ్రహాలకు కూడా ప్రయాణించే టెక్నాలజీ కనిపెట్టారు కానీ.. ఆదివాసీలకు వాగులు, వంకలు దాటేందుకు సురక్షితమైన మార్గం మాత్రం చూపలేకపోతున్నారు. ప్రభుత్వాలను, సమాజాన్ని నిందించడం మానేసిన ఆ ఆదివాసీలు కూడా అలాగే కాలం వెళ్లదీస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా బజార్హట్నూర్ మండలం కొత్తపల్లి గిరిజనులు నిత్యావసరాల కోసం స్థానికంగా ఉన్న బండ్రేవు వాగును దాటాలి. ఇది ఇప్పుడేం కొత్త కాదు.. ఎంతో కాలంగా ఇక్కడి ప్రజలకు, పాలకులకు మామూలు విషయమే. కాగా, ఈ గురువారం వారాంతపు సంత కోసం బజార్హట్నూర్ వెళ్లారు. సరకులు తీసుకొని వాగువద్దకు చేరగా నీటి ఉద్ధృతి పెరిగింది. ఏం చేయాలో పాలుపోని గిరిజనులు నెత్తిన సరుకుల బరువు మోస్తూనే ఒకరిచేయి ఒకరు పట్టుకొని ప్రమాదకరంగా వాగుదాటారు.
బండ్రేవు వాగుపై వంతెన లేక ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి వెళ్లే వారు వాగు ప్రవహించే సమయంలో రేవు దాటడం కన్నా ఇంట్లోనే కన్ను మూయడం మంచిదనే ఉన్న చోటనే ప్రాణాలు వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.