Adulterated Milk In Telangana
Adulterated milk in telangana : పొద్దు పొద్దున్నే ఇంటికి పాలొచ్చాయి.. పాలు తెల్లగా, చిక్కగా ఉన్నాయి.. కానీ మరిగిస్తుంటే అదో రకమైన వాసన.. మీగడ లేదు.. రంగు మారలేదు.. తోడుపెడితే పెరుగూ కాలేదు.. ఇంతకీ అవి పాలేనా..? యస్.. మీ అనుమానం నిజమే పాలలాంటి కల్తీ పాలు.. కాసుల కోసం జనం ఆరోగ్యంతో ఆడుకునే కల్తీగాళ్ల పాపాలు.. అవి తాగిన వారి ఆరోగ్యం ఆస్పత్రిపాలవుతోంది..!
కాదేదీ కల్తీకి అనర్హం అనే సామెతను సరిగ్గా వంటబట్టించుకుంటున్నారు కొందరు పాల వ్యాపారులు. ప్రాణాలు తీసే రసాయనాలతో కల్తీ పాలను తయారు చేసి జనం మీదకు వదులుతున్నారు. కాసుల వేటలో మానవత్వం మరుస్తున్నారు. పాలు పోసే వారి నుంచి డెయిరీ కంపెనీల వరకు అంతా కల్తీ పాలను తయారు చేస్తున్నారు. ప్యాకెట్లలో నింపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల వరంగల్, నల్లగొండ జిల్లాల్లో బయటపడ్డ రెండు ఘటనలు.. కల్తీ పాల గుట్టును రట్టు చేశాయి.
పొద్దున పాలు లేనిదే తెల్లవారదు. పెద్దలకు చాయ్ దగ్గరి నుంచి పిల్లలకు ఓ గ్లాసుడు పాల దాకా అత్యవసరం. కానీ డెయిరీ నిర్వాహకుల నిర్లక్ష్యం, కక్కుర్తి కారణంగా ఇప్పుడా పాలే ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. హైదరాబాద్‌లో అమ్ముడవుతున్న పాలలో దాదాపు 45 శాతం పాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో పలు బ్రాండ్ల పాల ప్యాకెట్లను ఇటీవల స్టేట్ ఫుడ్ లేబొరేటరీలో పరీక్షిస్తే.. ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. పాలలో ప్రమాదకరమైన ఇకోలీ, సాల్మోనెల్లా బ్యాక్టీరియా వంటి వాటి ఆనవాళ్లున్నాయని తేలింది. యూరియా, గ్లూకోజ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడా అధికంగా ఉన్నట్లు తేలింది.
రెండు రోజుల క్రితం హన్మకొండ జిల్లాలో గూడెప్పాడ్ NSR డైరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. డెయిరీ ఫిర్యాదులు పెరుగుతుండడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ నుంచి వెళ్లి ఎటాక్ చేశారు. ఎక్స్‌పైర్ అయిన ప్రొడక్టులతో పాలను ప్రాసెస్ చేస్తున్నారని గుర్తించారు. పాల పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపారు. రూల్స్ పాటించనందుకు డెయిరీని సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అటు ఈ నెల 3న యాదాద్రి జిల్లాలోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. పోచంపల్లి, భీమనపల్లి గ్రామాల్లో పాలు కల్తీ చేస్తున్న వ్యాపారులపై దాడులు చేశారు. చౌటుప్పల్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న పాల వాహనాలను తనిఖీ చేశారు. వ్యాపారస్తుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. 10 అనుమానిత శాంపిల్స్‌ను సేకరించి హైదరాబాద్ నాచారం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపారు. నెల రోజుల నుంచి కల్తీ పాల దందా జోరందుకోవడంతో.. ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆకస్మిక దాడులు నిర్వహించారు.
గ్రేటర్ హైదరాబాద్ నివసించే జనాభా కోటికి పైనే. రోజువారీ పాల అమ్మకాలు దాదాపు 30 లక్షల లీటర్లు. సహకార డెయిరీలు దాదాపు 10 లక్షల లీటర్లు విక్రయిస్తుండగా.. ప్రైవేట్ డెయిరీలు దాదాపు 20 లక్షల లీటర్లు విక్రయిస్తున్నాయని అంచనా. స్వచ్ఛమైన లీటర్ పాలకు 90 రూపాయల వరకు ధర పలుకుతుండగా.. ప్యాకెట్ పాలు 40 నుంచి 50 రూపాయల మధ్యలో దొరుకుతున్నాయి. అంటే.. ఒరిజినల్ పాలకన్నా.. ప్యాకెట్ పాల ధర దాదాపు సగం. అంటే.. ప్యాకెట్ పాలు ఎంత మేర కల్తీ అవుతాయో ఇక్కడే అర్థమవుతోంది.
పాలు నిల్వ ఉండేందుకు సోడా కలుపుతున్నారు.పాలు వాసన రాకుండా హైడ్రోజన్ పెరాక్సైడ్, చిక్కగా కనిపించేందుకు యూరియా, పాలలో కొవ్వు శాతాన్ని పెంచేందుకు జంతు సంబంధిత కొవ్వు, తియ్యటి రుచి కోసం గ్లూకోజ్ కలుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అటు పాలల్లో తరచూ బయటపడుతున్న సాల్మొనెల్లా, ఈకోలి వంటి బ్యాక్టీరియాలతో ప్రాణాలకు ముప్పు ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టైఫాయిడ్, డయేరియా, కడుపునొప్పి, వాంతులు, యూరియాతో మెదడుకు హాని కలిగే అవకాశాలున్నాయని వార్నింగ్ ఇస్తున్నారు. టాప్ బ్రాండ్ల పాలపై ఎలాంటి కంప్లైంట్లు లేకపోగా.. కొత్తగా పుట్టుకొస్తున్న బ్రాండ్లు.. ప్రైవేట్ వ్యాపారులు కల్తీ పాలను తయారు చేసి జనం ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.