Trujet Flights: రామ్ చరణ్ విమాన కంపెనీ “ట్రూజెట్” విమాన సేవలు తిరిగి ప్రారంభం..!

తెలుగు సినీ కథానాయకుడు రామ్ చరణ్ భాగస్వామిగా ఉన్న విమానయాన సంస్థ "ట్రూజెట్" సేవలు 18 రోజుల అనంతరం తిరిగి ప్రారంభం కానున్నాయి.

Trujet

Trujet Flights: ప్రముఖ తెలుగు సినీ కథానాయకుడు రామ్ చరణ్ భాగస్వామిగా ఉన్న విమానయాన సంస్థ “ట్రూజెట్” సేవలు 18 రోజుల అనంతరం తిరిగి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా మేఘ ఇంజనీరింగ్ సంస్థ భాగస్వామిగా ఉన్న టర్బో మేఘా ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్.. ట్రూజెట్ విమాన సంస్థలో రామ్ చరణ్ పెట్టుబడులు పెట్టారు. ఈక్రమంలో నిర్వహణ భారం, నిధుల కొరత కారణంగాట్రూజెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు ఫిబ్రవరి 5న సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. నిర్వహణ కార్యకలాపాల నిమిత్తం నిధులు సమీకరణలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఈక్రమంలో ఒక ఇన్వెస్టర్ నుంచి 25 మిలియన్ డాలర్లు రుణ సమీకరణానికి మార్గం సుగమం అయిందని, దీంతో ఫిబ్రవరి 23 నుంచి తిరిగి తమ విమాన సేవలు ప్రారంభం అవుతాయని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో సంస్థ వివరించింది.

Also read:Oil Discovered: రాజస్థాన్ లో చమురు నిక్షేపాలు కొనుగొన్న వేదాంత: కేంద్రానికి సమాచారం 

హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బెంగళూరు, విద్యానగర్, బీదర్ ఎయిర్ పోర్టుల మధ్య పలు సర్వీసులు, మహారాష్ట్రలోని ముంబై, నాందేడ్, కొల్హాపూర్, జల్గావ్ ఎయిర్ పోర్టుల మధ్య ట్రూజెట్ విమాన సేవలు కొనసాగుతున్నాయి. ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధిలో భాగంగా చిన్న తరహా పట్టణాల మధ్య వాయుమార్గ రవాణాను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన “ఉడాన్ పధకం” కింద ట్రూజెట్ సంస్థ ఏర్పాటు అయింది. సంస్థ నెలకొల్పిన నాటి నుంచి లాభాల దిశగా అడుగులేస్తున్న సమయంలో కరోనా విపత్తు దెబ్బకొట్టింది. దీంతో కొంతమేర నిధుల సమీకరణ, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో తిరిగి వ్యాపారం గాడిలో పడే అవకాశం ఉందని ట్రూజెట్ సీఈఓ వీ.ఉమేష్ తెలిపారు.

Also read: Corbevax : మేడిన్ ఇండియా.. పిల్లలకు అందుబాటులోకి మరో వ్యాక్సిన్