Hyderabad Rain
Hyderabad Rain : హైదరాబాద్ ను వానలు వెంటాడుతున్నాయి. మరోసారి నగరాన్ని వాన కుమ్మేసింది. కుండపోత వర్షంతో నగరం తడిసి ముద్దైంది. ఆదివారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది.
కూకట్ పల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, పంజాగుట్ట, నాంపల్లి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ లో భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ లో కుండపోత వర్షం పడుతోంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Also Read..Heavy Rains : తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు
రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరో రెండు గంటలు భారీ వర్షం కురిసే చాన్స్ ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని నగరవాసులను అధికారులు హెచ్చరించారు.
ఇవాళ, రేపు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇదివరకే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనా నిజమైంది. హైదరాబాద్ లో వాన దంచికొట్టింది. మరో రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉందని హెచ్చరికాలు జారీ చేసింది వాతావరణ శాఖ.
దాంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. మరోవైపు వర్షం కురుస్తున్న సమయంలో నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే సురక్షితం అని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. వర్షపు నీరు డ్రైనేజీలో సజావుగా వెళ్లేలా చూసేందుకు పలు ప్రాంతాల్లో అధికారులు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది కనుక నగరవాసులు అలర్ట్ గా ఉండాలని సూచించారు.