Acb (1)
Agriculture Officer: వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి, టెక్నాలజీ సాయంతో వసూళ్లు చేస్తున్న అవినీతి వ్యవసాయ శాఖ అధికారిని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో సెర్చ్ చేయకుండా ఉండాలంటే, లంచం ఇవ్వాలంటూ డీల్ చేసుకుంటూ.. చివరకు ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఎస్వీ రమణమూర్తి వివరాల మేరకు.. ఏ నెలలో ఎవరు? ఎంతెంత లంచాలు ఇచ్చారు? ఎంత లంచాలు ఇవ్వాలో చెప్పేందుకు సదరు అధికారి ఏకంగా వాట్సప్ గ్రూప్ ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో నార్లపాటి మహేష్‌చందర్ ఛటర్జీ ఎనిమిదేళ్లుగా మండల వ్యవసాయాధికారి(AO)గా పనిచేస్తున్నారు. అతని పరిధిలోకి వచ్చే ఎరువులు, పురుగుల మందుల దుకాణాలను సెర్చ్ చెయ్యకుండా ఉండేందుకు దుకాణానికి రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటూ ఆదేశించాడు. ఈ విషయమై చంద్రుగొండలోని ఆరు దుకాణాల యజమానులు మచ్చా కుమార్, గోదా సత్యం, ఎర్రం సీతారాములు, ముకేశ్, వెంకట్రామయ్య, చందర్‌రావు జులై 30న ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదు మేరకు పథకం ప్రకారం.. దుకాణాల నుంచి నగదు సేకరించినట్లుగా చెప్పి, సొమ్ము తీసుకోవడానికి రావాలంటూ ఏవోను కోరారు. ఈ మేరకు చంద్రుగొండ రైతు వేదికలో సత్యం, సీతారాములు నుంచి ఏవో రూ.90 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అదే సమయంలో అశ్వారావుపేటలోని ఆయన స్వగృహంలో ఏసీబీ సీఐ రఘుబాబు సోదాలు చేశారు. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని, చట్టప్రకారం అధికారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.