AIMIM Party : మజ్లిస్ పార్టీలో తొలిసారి ధిక్కార స్వరం.. రాజీనామాకు రహ్మత్ బేగ్ ససేమీరా? పార్టీ ఎమ్మెల్యేల కన్నా పవర్‌ఫుల్..!
AIMIM MLC Mirza Rahmat Baig : హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీ రాజకీయాలను దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యంతో శాసిస్తున్న ఏఐఎంఐఎం (మజ్లిస్) పార్టీలో ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ వివాదం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
- Harish Thanniru
- Updated on- August 31, 2026 / 09:48 AM IST
AIMIM party MLC Mirza Rahmat Baig
AIMIM MLC Mirza Rahmat Baig : హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీ రాజకీయాలను దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యంతో శాసిస్తున్న ఏఐఎంఐఎం (మజ్లిస్) పార్టీలో ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ వివాదం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అతనిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని నిర్ధారించిన మజ్లిస్ అధిష్టానం అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాక తక్షణమే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలంటూ రహ్మత్ బేగ్‌ను ఆదేశించింది. అయితే, అందుకు అతను ససేమీరా అనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మజ్లిస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ప్రజాప్రతినిధి అధిష్టానం నిర్ణయాన్నే ధిక్కరించే దిశగా అడుగులు వేస్తుండటం స్థానిక రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఓ బాలికతో ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్‌గా మారింది. దీనిపై పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విచారణకు ఆదేశించగా.. ఆరోపణలు నిజమని తేలడంతో శనివారం రహ్మత్ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఎమ్మెల్సీ పదవిని వెంటనే వీడాలని, రాజీనామా పత్రాన్ని శాసనమండలి చైర్మన్‌కు అందజేయాలని పార్టీ ఆదేశించింది. అయితే, రహ్మత్ బేగ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు ససేమీరా అన్నట్లు తెలిసింది. ఆయనతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించేందుకు పార్టీ నేతలు ప్రయత్నించగా.. తప్పించుకొని వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో అతని కోసం మజ్లిస్ శ్రేణులు గాలిస్తున్నట్లు సమాచారం.
98 ఏళ్ల చరిత్ర కలిగిన మజ్లిస్ పార్టీ హైదరాబాద్ కేంద్రంగా దేశం మొత్తం విస్తరించగా.. జాతీయ వ్యవహారాలను అసదుద్దీన్, రాష్ట్ర వ్యవహారాలను ఆయన సోదరుడు అక్బరుద్దీన్ పర్యవేక్షిస్తున్నారు. వీరి మాటను కాదని ముందుకెళ్లే సాహసం ఆ పార్టీలో ఎవరూ చేయరు. దీంతో ఇన్నాళ్లుగా ఎలాంటి ధిక్కారస్వరం లేకుండా మజ్లిస్ పార్టీ కొనసాగుతోంది. అయితే, తొలిసారి ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ తన పదవికి రాజీనామా విషయంలో ధిక్కారస్వరం వినిపించినట్లు తెలుస్తోంది.
ఉమ్రా యాత్ర ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న రహ్మత్ బేగ్ తనపై వచ్చిన ఆరోపణలు.. పార్టీ నుంచి బహిష్కరణ అంశాలపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేది లేదని, చట్టపరంగా, న్యాయపరంగా పోరాడతానని తన వర్గీయుల వద్ద స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బేగ్ స్వచ్ఛందంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకపోతే.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసి ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయించేందుకు మజ్లిస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో మజ్లిస్ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మజ్లిస్ పార్టీ రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిగా బహదూర్‌పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్‌ను నియమించింది. ఇదిలాఉంటే.. రహ్మత్ బేగ్ మజ్లిస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు.2018లో రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయినప్పటికీ పార్టీలో క్రియాశీకలంగా పనిచేస్తూ వచ్చాడు. దీంతో ఎంఐఎం అధిష్టానం అతనికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. పార్టీలో ఎలాంటి సమస్య ఎదురైనా చక్కదిద్దేందుకు రహ్మత్ బేగ్‌కు అధిష్టానం బాధ్యతలు అప్పగించేది. దీంతో ఆయన పార్టీలో కీలక వ్యక్తిగా మారాడు. ఒకవిధంగా చెప్పాలంటే.. మజ్లిస్ పార్టీలో అక్బరుద్దీన్ మినహా.. మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల కంటే రహ్మత్ బేగ్ పవర్ ఫుల్ నేతగా ఉన్నారని సమాచారం.
