Telangana Air Pollution
Telangana Air Pollution Drops : లాక్ డౌన్ తో తెలంగాణలో మరోసారి కాలుష్యం గణనీయంగా తగ్గింది. పలు నగరాలు గ్రీన్ జోన్ లోకి వచ్చాయి. గతేడాది లాక్ డౌన్ ఎత్తేశాక పెరిగిన కాలుష్యం మళ్లీ ఇంతకాలానికి హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గడంతో ప్రజలు స్వచ్చమైన గాలి పీల్చుకోగలుగుతున్నారు.
తెలంగాణలోని నగరాల్లో నివసించే వారు మరోసారి స్వచ్చమైన గాలి పీల్చుకోగలుగుతున్నారు. కాలుష్యంతో సతమతం అయ్యే పలు నగరాలు, పట్టణాల్లో వాయు, ధ్వని కాలుష్యం తగ్గుతోంది. కరోనా సెకండ్ వేవ్ తో లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన 6వ రోజుకే హైదరాబాద్ నగరం గ్రీన్ జోన్ లోకి వచ్చింది. పరిశ్రమలు మూతపడటం, వాహన రాకపోకలు ఆగిపోవడంతో వాయు కాలుష్యం భారీగా తగ్గి నాణ్యత సూచిక మెరుగుపడింది.
మహానగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సగటున 25 పాయింట్లు నమోదయ్యాయి. తెలంగాణ పొల్యూషన్ బోర్డు ప్రకటించిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాణాలు గమనిస్తే.. మలక్ పేట, బాగ్ లింగంపల్లిలో 25పాయింట్లు.. శేరిలింగంపల్లి, కొండాపూర్ లో 30పాయింట్లు, జూపార్క్ వద్ద 41 పాయింట్లు నమోదయ్యాయి. లాక్ డౌన్ కు ముందు ఈ ప్రాంతాల్లో 90 నుంచి 110 పాయింట్లుగా వాయు కాలుష్యం నమోదయ్యేది. గతేడాది కూడా కరోనా తొలి విడతలో సుదీర్ఘకాలం కొనసాగిన లాక్ డౌన్ తో హైదరాబాద్ సహా పలు నగరాలు, పట్టణాల్లో కాలుష్యం తగ్గింది. అయితే, లాక్ డౌన్ ఎత్తేశాక వాహనాల రాకపోకలు, పరిశ్రమల ఉత్పత్తితో కాలుష్యం విపరీతంగా పెరిగింది.
మరోసారి లాక్ డౌన్ తో గాలిలో నాణ్యత పెరగడంతో, శ్వాసకోశ ఇబ్బందులతో సతమతం అయ్యేవారు హాయిగా ఊపిరిపీల్చుకోగలుగుతున్నారు. వరుసగా రెండో ఏడాది కాలుష్యం తగ్గడంతో ఇందుకోసమైన ఏటా కొన్ని రోజులపాటు లాక్ డౌన్ విధిస్తే బాగుంటుందనే వాదన వినిపిస్తున్నారు.