Alai Balai Program
Bandaru Dattatreya: హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆలయ్ బలయ్ కార్యక్రమం ఇవాళ ఉదయం 10గంటలకు జరగనుంది. గత 19 సంవత్సరాలుగా దసరా మరుసటిరోజు ఆలయ్ బలయ్ కార్యక్రమంను బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాను గవర్నర్ అయిన తర్వాత తన కూతురు బండారు విజయలక్ష్మికి కార్యక్రమం నిర్వహణ బాధ్యతలను దత్తాత్రేయ అప్పగించారు. దీంతో ఆలయ్ బలయ్ కార్యక్రమానికి చైర్మన్ గా బండారు విజయలక్ష్మి ఉన్నారు. రాజకీయంగా రోజు విమర్శలు చేసుకునే నేతలు ఆలయ్ బలయ్ కార్యక్రమం ద్వారా ఒకే మీదకు వస్తుంటారు.
ఇవాళ జరిగే ఆలయ్ బలయ్ కార్యక్రమంకు పలు రాష్ట్రాల గవర్నర్లు సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రాంమోహన్ నాయుడు, బండి సంజయ్, భూపతి రాజు శ్రీనివాస వర్మ, తెలుగు రాష్ట్రాల రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, వై. సత్య కుమార్ సహా పలువురు నేతలు పాల్గోనున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి హరీష్ రావు హాజరుకానుండగా.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గోనున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు తగిన గుర్తింపు ఇవ్వడం కోసమే ఆలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ వస్త్రధారణ, కళాకృతులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. గొంగడి, ఒగ్గుడోలు కళాకారులు, గంగిరెద్దులు, చిందు గానం, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో నిర్వహించనున్నారు. అదేవిధంగా తెలంగాణ వంటకాలైన చికెన్ మటన్ తోపాటు తలకాయ కూర, బోటీ, పాయా, గారెలు, సకినాలు, అరిసెలు, నువ్వుల లడ్డులతో భోజనాలు ఉండనున్నాయి. నరేంద్రమోదీ మిలేట్స్ ను ప్రోత్సాహించాలనే సూచన మేరకు మిలేట్స్ వంటకాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని సినీ ప్రముఖులను ఎవరిని ఆహ్వానించలేదని నిర్వాహకులు తెలిపారు.