Gaddam Aravind Reddy
Aravind Reddy – Prem Sagar Rao : కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకుంటున్న ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యేగా గెలిస్తే అరాచకాలు ఎక్కువ అవుతాయని మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన ప్రేమ్ సాగర్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేశాడని తెలిపారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేలు గడ్డం అరవింద్ రెడ్డి, గోనే ప్రకాష్ రావు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అరవింద్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఎన్నో అవినీతి, అక్రమాలు చేశాడని విమర్శించారు. ప్రేమ్ సాగర్ రావ్ ను ఓడించడమే తన లక్ష్యం అన్నారు. ఆదివారం కేటీఆర్ ని కలిసి మంచిర్యాల టిక్కెట్ ను బీసీలకు కేటాయించాలని కోరామని తెలిపారు.
కేటీఆర్ తన ప్రపోజల్ కి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఒకవేళ తన ప్రపోజల్ ని బీఆర్ఎస్ ఒప్పుకోకపోతే బీసీ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు మాట్లాడారు.
మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్ లో బీసీలకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే మూడు కోట్ల రూపాయల విలువైన తన 30 గంటల భూమిని విరాళంగా అందిస్తానని వెల్లడించారు. బీసీ జనాభా ప్రాతిపదికన మంచిర్యాల టిక్కెట్ ను అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులకే కేటాయించాలని సూచించారు.