×
Ad

Andesri : గొర్రెల కాపరి నుంచి డాక్టరేట్ వరకు.. అందెశ్రీ ప్రయాణం సాగిందిలా.. ఒక్కోపాట ఒక్కో డైమండ్.. జనాన్ని ఉర్రూతలూగించిన పాట ఇదే..

Andesri : అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అనే గీతంతో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు.

Andesri

Andesri : ప్రముఖ కవి, రచయిత, గేయకర్త అందెశ్రీ (64) సోమవారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీన గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ మృతి తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వర్గాల్లో తీరన శోకాన్ని నింపింది.

అందెశ్రీ 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన అనాథగా పెరిగారు. జీవనం కోసం కొన్నాళ్లు గొర్రెల కాపరిగా.. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. అందెశ్రీ పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు. ఉద్యమ పాటలతో అందెశ్రీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి పురస్కారం అందించింది. 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా రూ.కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు.

Also Read: Ande Sri : అందెశ్రీ కన్నుమూత.. సీఎం రేవంత్, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు నివాళి..

ఆశు కవిత్వం చెప్పడంతో అందెశ్రీ దిట్ట. గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించిన అందెశ్రీలోని కవితా ప్రతిభను శృగేరి మఠానికి చెందిన స్వామీ శంకర్ మహారాజ్ గుర్తించి, ఆయన్ను చేరదీసి ప్రోత్సహించారు. తెలంగాణ ఉద్యమంతోపాటు ప్రకృతి వంటి అంశాలపై ఆయన రాసిన గేయాలు రాష్ట్ర వ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా, నారాయణ మూర్తి సినిమాల ద్వారా ఆయన పాటలు విప్లవాత్మక విజయాలు సాధించాయి.

‘పల్లెనీకు వందనములమ్మో’, ‘గలగల గజ్జెలబండి’, ‘కొమ్మ చెక్కితే బొమ్మరా.. ’, ‘జన జాతరలో మన గీతం’, ‘యెల్లిపోతున్నావా తల్లి’ వంటి పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక.. ‘మాయమై పోతున్నడమ్మో మనిషన్నవాడు’ అనే పాట విశేష ఆదరణ పొందింది. ఈ ప్రసిద్ధ గీతం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల తెలుగు రెండవ సంవత్సరం సిలబస్ లో చేర్చబడింది. సినీ రంగంలో ఆయన రాసిన పాటల్లో ఎంతో లోతైన భావాలు ఉంటాయి. ఒక విచిత్రం సినిమాలో ఈతరం తీర్పు అనే పాట అదేవిధంగా ముత్యాల ముగ్గు సినిమాలో చిలకా ఏడున్నది అనే పాటలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.

అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అనే గీతంతో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్శిటీ నుంచి అందెశ్రీకి గౌరవ డాక్టరేట్ లభించింది. 2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం లభించింది.

అంతేకాక.. 2014లో అకాడమి ఆఫ్‌ యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ డాక్టరేట్‌ వరించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది. అందెశ్రీ లోక్‌నాయక్‌ పురస్కారాన్ని అందుకున్నారు.