×
Ad

Ande Sri : అందెశ్రీ కన్నుమూత.. సీఎం రేవంత్, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు నివాళి..

Andesri : అందెశ్రీ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.

Ande Sri

Ande Sri : ప్రముఖ కవి, రచయిత, గేయకర్త అందెశ్రీ (64) సోమవారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీన గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ మృతి తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వర్గాల్లో తీరన శోకాన్ని నింపింది. అందెశ్రీ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.

అందెశ్రీకి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది: సీఎం రేవంత్‌
అందెశ్రీ ఆకస్మిక మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ సీఎం సంతాపం వ్యక్తం చేశారు.

 


అందెశ్రీ మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్ ..
అందెశ్రీ ఆకస్మిక మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో, కవిగా తన పాటలతో, సాహిత్యంతో, కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటు అని, ఉద్యమ కాలంలో అందెశ్రీ తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. అందెశ్రీ మరణంతో శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దివంగత అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.

అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించింది : ఏపీ సీఎం చంద్రబాబు


అందెశ్రీ అకాల మరణం తీవ్రంగా కలచివేసింది : మంత్రి దామోదర్ రాజనర్సింహ
అందెశ్రీ మృతిపట్ల ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
ఆయన అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని, అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు మంత్రి సానుభూతి ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

సాహితీ వ‌నంలో మ‌హావ‌ట‌వృక్షం కూలింది : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్ర గీతమైన జ‌య‌జ‌య‌హే తెలంగాణ ర‌చ‌యిత అందెశ్రీ ఆక‌స్మిక మృతి ప‌ట్ల రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మంలో ఆయ‌న ర‌చించిన జ‌య‌జ‌య‌హే తెలంగాణ గీతం జాతి గొంతుకై.. అంద‌రిని ఒక్క‌తాటి మీద‌కు తీసుకువ‌చ్చింద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయ‌న చేసిన సాహితీ కృషి చరిత్ర ఉన్నంత‌ వ‌ర‌కూ నిలిచిపోతుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి చెప్పారు. ప్ర‌జాప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ఆయ‌న ర‌చించిన జ‌య‌జ‌య‌హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్ర‌క‌టించిన రోజున ఆయ‌న ఎంతో ఉద్విగ్న‌త‌కు లోనైన విష‌యాన్ని భట్టి విక్ర‌మార్క గుర్తు చేసుకున్నారు. అందెశ్రీతో త‌న‌కున్న అనుబంధాన్ని స్మ‌రించుకున్నారు. ఆయ‌న‌తో క‌లిసి పంచుకున్న దార్శ‌నిక ఆలోచ‌న‌లు అట్ట‌డుగు వ‌ర్గాల‌కు సంక్షేమ ఫ‌లాలు అందాల‌న్న త‌ప‌ప‌ను ఉప ముఖ్య‌మంత్రి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాహితీవ‌నంలో నిఠారుగా ఎదిగిన మ‌హా వ‌ట‌వృక్షం నేల‌కూలిట్లుగా ఆయ‌న మ‌ర‌ణం ఉంద‌ని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క త‌న సంతాపాన్ని ప్ర‌క‌టించారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు భ‌ట్టి విక్ర‌మార్క త‌న ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు‌.

♦ ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అకాల మరణం బాధాకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సంపతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.

♦ ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల మంత్రి వాకిటి శ్రీహరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహిత్య లోకానికి తీరని లోటని అన్నారు. అందెశ్రీ పాటతో తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని నొక్కి చెప్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారని, రాష్ట్ర సిద్దించడంలో ఆయన పాత్ర కీలకమైందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.