సామాన్యుడిపై మరో భారం : పాల ధరలు పెరుగుతాయా ?

milk-prices-rise

Will milk prices rise ? : ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలతో నానా ఇబ్బందులు పడుతున్న సామాన్యుడిపై మరో భారం పడనుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కరోనా లాక్‌డౌన్ తర్వాత సుమారు 2 వందల రూపాయల వరకు గ్యాస్ ధర పెరిగినట్టు అంచనా. ఇప్పటికే వీటి విషయంపై మండిపోతున్న ప్రజలు వారి ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా పాల ధరలు కూడా పెరగనున్నాయని సమాచారం.

ప్రస్తుతం పాల ధర బహిరంగ మార్కెట్ లో లీటరు 60 రూపాయలుగా ఉంది. పదకొండు రోజుల నుంచి డీజిల్ రేట్లు ఏకధాటిగా పెరగడంతో రవాణా ఛార్జీలు కూడా తడిసి మోపెడవుతున్నాయి. దీంతో ఆ భారం వినియోగదారులపై వేయక తప్పని పరిస్థితి అని పాల ఉత్పత్తి దారులు తెలియజేస్తున్నారు. డీజిల్ ధరల పెరుగుదల కారణంగా పశువుల దాణా కోసం, సేకరించిన పాలను విక్రయించడాయినికి అయ్యే ఖర్చులు భారీగా అవుతున్నట్లు పాల ఉత్పత్తి దారులు పేర్కొన్నారు.
ఇప్పుడు ఆ పెరిగిన ధరలను ప్రజలపై వేయక తప్పదని ఏపీలో ప్రముఖ డెయిరీ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. పెరిగే పాల ధర కనీసం లీటర్ మీద 2రూపాయల వరకు ఉండొచ్చని చెప్పారు. భవిష్యత్‌లో ఇదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే పాల ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.