Pawan Kalyan
Pawan Kalyan : తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం దర్శించుకున్నారు. రూ. 35.19 కోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో భక్తుల వసతి కోసం 96గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి పవన్ కల్యాణ్ భూమి పూజ చేశారు. పవన్ కల్యాణ్ తోపాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, తెలంగాణ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కొండగట్టు అంజన్న అంటే నాకు సెంటిమెంట్. అంజన్న ఆశీస్సులతోనే ప్రమాదం నుంచి బయడ్డా. కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి నేను ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. కొండగట్టు అభివృద్ధికి నా వంతు సాయం చేస్తానని పవన్ అన్నారు. గతంలో దర్శనానికి వచ్చినప్పుడు దీక్ష విరమణకు మండపం, సత్రం కావాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు, తెలంగాణ నాయకులు అందరి సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. అంజన్న ఆశీస్సులతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పవన్ అన్నారు. గిరి ప్రదక్షిణ అంశాన్ని నా దృష్టికి తెచ్చారు. కొండగట్టు గిరి ప్రదక్షిణకు సహాయం చేస్తామని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ కృతజ్ఙతలు తెలిపారు. రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని, ఆంజన్న ఆశీస్సులు ఆయనకు ఉండాలని పవన్ పేర్కొన్నారు.