భూమా అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్…చంచల్ గూడ జైలుకు తరలింపు

Bhuma Akhilapriya remanded for 14 days : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియకు రిమాండ్ విధించారు. భూమా అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్ మంజూరు చేయాలని అఖిలప్రియ పిటిషన్ దాఖలు చేశారు. అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై రేపు సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరుగనుంది.

అంతకముందు ఆమెకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. నీరసం వల్లే అఖిలప్రియ కళ్లు తిరిగి పడిపోయిందని… ఆమెకు ఎలాంటి సమస్య లేదని వైద్యులు తేల్చారు. వైద్య పరీక్షలు పూర్తైన వెంటనే అఖిలప్రియను పోలీసులు రహస్యంగా తరలించారు. ఆ సమయంలో గాంధీ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇక వైద్య పరీక్షలు పూర్తవడంతో… అఖిలప్రియను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.

బోయిన‌ప‌ల్లి కిడ్నాప్ కేసును పోలీసులు మూడు గంట‌ల్లోనే చేధించారు. నిన్న రాత్రి మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు ఆయన సోదరులు సునీల్‌, నవీన్‌లు కిడ్నాప్‌కు గురయ్యారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి కేసును చేధించారు. కేసులో ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2గా ఏపీ మాజీ మంత్రి అఖిల‌ప్రియ‌, ఏ3గా భార్గ‌వ్‌రామ్ ఉన్నారు.

ఏ1, ఏ2 నిందితుల‌ను అరెస్టు చేసిన పోలీసులు ఏ3 నిందితుడు, అఖిల‌ప్రియ భ‌ర్త‌ భార్గ‌వ్‌రామ్ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. కిడ్నాప్‌పై పోలీసుల ద‌ర్యాప్తు ప్రారంభం కాగానే భార్గ‌వ్‌రామ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆచూకీ కోసం సీసీ కెమెరా ఫుటేజీల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.