Batukamma Festival in Sydney
Batukamma Festival in Sydney: తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మ పర్వదినాన్ని ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రవాస తెలంగాణవాసులు కన్నుల పండువగా జరుపుకున్నారు. సిడ్నీ బతుకమ్మ దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF), ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ATF) ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక బౌమాన్ హాల్ బ్లాక్‌టౌన్ సెంటర్‌లో నిర్వయించిన బతుకమ్మ సంబరాల్లో 1500 మందికి పైగా తెలంగాణ వాసులు పాల్గొని వేడుకలను సాంప్రదాయబద్దంగా జరుపుకున్నారు.
సాంప్రదాయ దుస్తుల్లో మహిళల బతుకమ్మ ఆటపాటలతో సిడ్నీ నగరం పులకించింది. ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లు మార్మోగాయి. వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు ఆడపడుచుల సప్తవర్ణాల శోభితమైన పూలదొంతరల బతుకమ్మలు చూడముచ్చటేశాయి. రంగు రంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలతో సందడి చేశారు. తర్వాత బతుకమ్మల చుట్టూ చేరి ఉయ్యాల పాటలు పాడారు. ఉత్తమ బతుకమ్మలను నిర్వాహకులు ఎంపిక చేసి, మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు.
Batukamma Festival in Sydney
ఈ వేడుకల్లో జమ్మి పూజతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే పలు నృత్య ప్రదర్శనలు జరిగాయి. కోలాటం, శివ గర్జన డ్రమ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి కారణమైన కార్య నిర్వాహక కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి తోతుకుర్, డేవిడ్ రాజు, కవిత తోతుకుర్, లత కడపరతి, కావ్య గుమ్మడవల్లి, వాణి ఏలేటి, శ్వేత యమ, శ్వేత తెడ్ల, హారిక మన్నెం, వత్సల ముద్దం, విద్యా సేరి తదితరులను SBDF చైర్మన్ అనిల్ మునగాల అభినందించారు.
Batukamma Festival in Sydney
మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరానికి అందించడానికి ఇటు వంటి కార్యక్రమాలు దానికి ఎంతో సహకరిస్తాయని శ్రీనివాస్ రెడ్డి తోతుకుర్ ఈ సందర్భంగా అన్నారు. బతుకమ్మ వేడుకలు విజయవంతం కావడానికి కారణమైన స్పాన్సర్స్, కమూనిటీ పార్ట్నర్స్, మీడియా పార్ట్నర్స్, వాలంటీర్స్, కార్యవర్గ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలియచేశారు.