Ayesha Meera
Ayesha Meera : అయేషా మీరా అవశేషాలను (అస్థికలు) కోర్టు ఆదేశాల మేరకు వారి తల్లిదండ్రులకు సీబీఐ అధికారులు శుక్రవారం అప్పగించారు. ఈ సందర్భంగా అయేషా తల్లిదండ్రులు శంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బిడ్డా మమ్మల్ని క్షమించు, నీకు న్యాయం చేయలేకపోయాం అంటూ జడ్జి ముందు బోరున ఏడ్చారు. తమకు సీబీఐ, న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థలో ఏదీ న్యాయం చేయలేదంటూ జడ్డి ముందు బోరున విలపించారు.
Also Read : కడిగిన ముత్యంలా బయటికొచ్చా.. క్లీన్ చిట్ రాగానే కవిత ఫస్ట్ ఫోన్ కాల్..
32 దేశాల్లో తన విద్యార్థులు ఉన్నారని, ఇంత అన్యాయం ఎక్కడా లేదంటూ అయేషా మీరా తండ్రి కన్నీటి పర్యాంతమయ్యాడు. బాధితులను నిందితులుగా నిందితులను సాక్షులుగా ఈ వ్యవస్థలు చేశారు.. బిడ్డా మమ్మల్ని క్షమించు అంటూ వారు బోరున విలపించడంతో కోర్టులోని పలువురు మహిళా లాయర్లు కన్నీటి పర్యాంతమయ్యారు.
అయేషా మీరా అస్థికలు అందుకున్న ఆమె తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలు కోర్టు ప్రాంగణం నుంచి ర్యాలీగా తెనాలి వెళ్లేందుకు బయలుదేరారు. అయితే, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని, నేరుగా తెనాలి తీసుకెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు అయేషా మీరా అస్థికలతో ఆమె తల్లిదండ్రులు, అడ్వకేట్‌లు, మానవతావాదులు ర్యాలీ తీశారు. అయేషా మీరా ఆత్మకు శాంతి కలగాలని, నేరస్థులను శిక్షించాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తూ అయేషా తల్లి ఉద్రేకాన్ని ఆపుకోలేకపోయారు. అంబేద్కర్ విగ్రహనికి నమస్కరిస్తూ రాజ్యాంగం రాశావు.. కానీ, మాకు న్యాయం జరుగలేదని అంబేద్కర్ విగ్రహం ముందు ఆయేషామీరా తల్లి శంషాద్ బేగం కన్నీరు పెట్టుకున్నారు.
ఆ తరువాత కోర్టు ఆదేశాలతో ప్రత్యేక భద్రత నడుమ అంబులెన్సులో అయేషా మీరా అవశేషాలను తెనాలికి తరలించారు. తెనాలిలోని స్మశాన వాటికలో వారి మతాచారం ప్రకారం అయేషా మీరా అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా చూడాలని అధికారులను కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేకాక.. అంత్యక్రియల ప్రక్రియ మొత్తం సరైన పద్దతిలో జరుగుతున్నట్లు రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. సంబంధత ప్రభుత్వ అధికారులు ఆ సమయంలో తప్పనిసరిగా హాజరు కావాలని న్యాయస్థానం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.