Padi Kaushik Reddy
Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. కరీంనగర్ నగర్ రెండో అదనపు కోర్టు న్యాయమూర్తి మూడు కేసుల్లో కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో చోటుచేసుకున్న ఘటనలో కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం రాత్రి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. 10టీవీ కార్యాలయంలో ఇంటర్వ్యూలో పాల్గొని బయటకు వచ్చిన వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కౌశిక్ రెడ్డిని నేరుగా కరీంనగర్ తీసుకెళ్లారు.
Also Read: Kaushik Reddy Arrest: రాత్రంతా పోలీస్ స్టేషన్‌లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..
సోమవారం అర్థరాత్రి సమయంలో కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు కౌశిక్ రెడ్డిని తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రంతా పీఎస్ లో కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఉదయాన్నే మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. ఉధయం 9గంటల సమయంలో భారీ భద్రత మధ్య కరీంనగర్ రెండో అదనపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన సందర్భంగా కరీంనగర్ కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గంటపాటు ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి కౌశిక్ రెడ్డికి మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు. రెండు కేసుల్లో రూ.50వేల చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని, పోలీసుల విచారణకు సహకరించాలని సూచించారు.
కౌశిక్ రెడ్డిపై గతంలోనూ పలు కేసులు ఉన్నందున రిమాండ్ విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు విపించగా.. కౌశిక్ రెడ్డిపై నమోదైన అన్ని సెక్షన్లు బెయిల్ బుల్ కాబట్టి రిమాండ్ ను కొట్టివేయాలని బీఆర్ఎస్ లీగల్ టీం వాదించింది. గంటపాటు ఇరువర్గాల వాదన విన్న అనంతరం.. బీఆర్ఎస్ లీగల్ టీం వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు.