Kaushik Reddy: పదిరోజుల తరువాతే వస్తా..! ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణ వాయిదా.. కారణం ఏమిటంటే?

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇవాళ్టి విచారణ వాయిదా పడింది. బంజారా హిల్స్ సీఐ, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, వారిపట్ల దురుసుగా ప్రవర్తించాడంటూ నమోదైన కేసులో..

Kaushik Reddy

BRS MLA Kaushik Reddy: హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇవాళ్టి విచారణ వాయిదా పడింది. బంజారా హిల్స్ సీఐ, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, వారిపట్ల దురుసుగా ప్రవర్తించాడంటూ నమోదైన కేసులో.. కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్లో శుక్రవారం బంజారాహిల్స్ పీఎస్ కు విచారణకు రావాలని సూచించారు. అయితే, తాను విచారణకు హాజరుకాలేక పోతున్నానని పోలీసులకు కౌశిక్ రెడ్డి సమాచారం ఇచ్చారు. కౌశిక్ రెడ్డి తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. గుండె ఆపరేషన్ నిర్వహించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో తన తండ్రి అనారోగ్యం కారణంగా పదిరోజుల వరకు విచారణకు హాజరుకాలేనని పోలీసులకు కౌశిక్ రెడ్డి సమాచారం ఇచ్చారు. అయితే, ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. వచ్చే నెల (జనవరి) 6వ తేదీన పోలీస్ స్టేషన్ కు రావాలని సూచించారు.

Also Read: CM Revanth Reddy : అసెంబ్లీ మాటకు కట్టుబడి ఉంటాను.. బెనిఫిట్ షోలు ఇవ్వను.. టాలీవుడ్ మీటింగ్ లో సీఎం ఏం చెప్పారంటే..

అసలేం జరిగిందంటే..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారని పేర్కొంటూ ఈనెల 4న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొందరు బీఆర్ఎస్ నేతలతో కలిసి వెళ్లారు. ఫిర్యాదు తీసుకునే విషయంలో పోలీసు సిబ్బందికి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి వచ్చే సమయంలో సీఐ అర్జెంట్ పనినిమిత్తం బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. తాను వచ్చిన తరువాత ఫిర్యాదు తీసుకుంటానని సీఐ పేర్కొనగా.. తాను ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన తరువాతనే బయటకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ కౌశిక్ రెడ్డి, ఆయన వెంట వచ్చిన బీఆర్ఎస్ నేతలు సీఐ కారును అడ్డుకున్నారు. మళ్లీ వచ్చిన ఫిర్యాదు తీసుకుంటానని సీఐ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. కాంగ్రెస్ కండువా కప్పుకుని డ్యూటీ చేయండంటూ సీఐని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. నాలుగేళ్ల తరువాత మీ సంగతి చెబుతామంటూ పోలీసు సిబ్బంది పట్ల బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డితోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

Also Read: Manmohan Singh : దేశం గొప్ప నేతను కోల్పోయింది- మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం..

ఈనెల 6న కొండాపూర్ లోని ఆయన నివాసంలో పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా.. విచారణ అనంతరం కౌశిక్ కు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. తాజాగా.. బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించి, దురుసుగా ప్రవర్తించారన్న కేసులో ఈనెల 25న మధ్యాహ్నం కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10గంటలకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. తాజాగా. తన తండ్రి అనారోగ్యం కారణంగా తాను పదిరోజుల వరకు విచారణకు హాజరుకాలేనని.. వచ్చే నెల 6వ తేదీన విచారణకు హాజరవుతానని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కౌశిక్ రెడ్డి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు వచ్చే నెల 6న విచారణకు హాజరు కావాలని సూచించారు.

ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అయితే, సాయంత్రం శ్రీనివాస్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు వ్యవహారంలో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ప్రభుత్వంలోని పెద్దల సూచనలకు అనుగుణంగా పోలీసులు అక్రమ కేసులు పెట్టి తమను వేధిస్తున్నారని, ఈ అక్రమ కేసులకు తాము భయపడేది లేదని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.