Bandi Sanjay : సంజయ్‌కి అస్సలు మింగుడు పడటం లేదట.. గెలిచే చాన్స్ లేదని చెప్పకనే చెప్పేశారా?

అధ్యక్షుడిగా ఎంతో కష్టించి పనిచేసినా.. ఏ కారణం లేకుండా పదవి నుంచి తప్పించడంపై సంజయ్ అసంతృప్తితో ఉన్నట్లు వస్తున్న వార్తలతో కమలం పార్టీలో కలకలం రేగింది.

Bandi Sanjay

Bandi Sanjay Dissatisfaction : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తప్పించడం బండి సంజయ్‌కి అస్సలు మింగుడు పడటం లేదట. ఏ తప్పు చేయకపోయినా.. పదవి నుంచి తప్పించి అవమానించారని సంజయ్ తెగ ఫీల్ అవుతున్నారట. తనను ఎన్నికల వరకు కొనసాగిస్తే తెలంగాణలో కమలం జెండా ఎగిరేదేనంటూ ఢిల్లీ పెద్దలకు చెప్పేసిన బండి.. ఇక ఈసారి బీజేపీకి గెలిచే చాన్స్ లేదని చెప్పకనే చెప్పేశారా? అసలు బీజేపీలో ఏం జరుగుతోంది? బండి సంజయ్ మనసులో ఏముంది? తెరవెనుక రాజకీయమేంటి?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ సక్సెస్ ఫుల్గా పనిచేశారు. మూడేళ్ల పదవీ కాలం పూర్తయిందనే కారణంతో.. ఎన్నికల ముందు ఆయనను పదవి నుంచి తప్పించడంపై కొద్ది రోజులుగా బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎక్కడో అట్టడుగున ఉన్న పార్టీని.. అధికార బీఆర్ఎస్‌కు సమ ఉజ్జీగా నిలబెట్టడంలో సంజయ్ కృషి ఎంతో ఉందని కార్యకర్తలు చెప్పుకుంటుంటారు. మూడేళ్ల క్రితం వరకు కరీంనగర్ రాజకీయాలకే పరిమితమైన సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత.. సంఘ్ నేపథ్యంతో ఏకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత పాదయాత్ర చేసి బీజేపీకి తెలంగాణలో వైభవం తీసుకువచ్చారు. ఈటల, కొండా విశ్వేశ్వరరెడ్డి, చంద్రశేఖర్, విజయశాంతి (Vijaya Shanthi), రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) ఇలా ఎందరో ప్రముఖ నేతలను అధ్యక్ష హోదాలో పార్టీలో చేర్చుకున్నారు బండి. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం దక్కింది కూడా బండి అధ్యక్షునిగా ఉన్నప్పుడే. అటు గ్రేటర్ ఎన్నికల్లోనూ 4 సీట్లకే పరిమితమైన బీజేపీకి 48 సీట్లు కట్టబెట్టింది కూడా బండినే. అంతేకాదు.. హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించి అగ్రనాయకత్వంతో భేష్ అనిపించుకున్నారు.

అధ్యక్షుడిగా ఎంతో కష్టించి పనిచేసినా.. ఏ కారణం లేకుండా పదవి నుంచి తప్పించడంపై సంజయ్ అసంతృప్తితో ఉన్నట్లు వస్తున్న వార్తలతో కమలం పార్టీలో కలకలం రేగింది. అధ్యక్షుడిగా తప్పుకున్న తర్వాత ఇన్నాళ్లు గుంభనంగా ఉన్న సంజయ్.. పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లి తన మనసులోని ఫీలింగ్స్‌ను సీనియర్లతో చెప్పుకుని బాధపడుతున్నట్లు చెబుతున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా.. ఆర్థిక వనరులు లేకపోయినా.. అన్నివిధాలా కష్టపడి పనిచేశానని.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి టార్గెట్ అయి టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కూడా జైలుకు వెళ్లాల్సివచ్చిందని.. ఎంత చేసినా తన పనితనంపై ప్రచారం చేసుకోకపోవడమే దెబ్బతీసిందని సంజయ్ వాపోతున్నారని అంటున్నారు. మరోవైపు తాను చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా పార్టీ పెద్దలు డిజైన్ చేసిందేనని.. టీవీ, పేపర్లలో ఇచ్చిన యాడ్స్ కూడా పార్టీ డిజైన్ చేసినవేనని గుర్తు చేస్తున్నారు. తాను పొరపాటు చేసినట్లు ఎప్పుడూ ఏ నాయకుడూ తనకు చెప్పలేదని.. సడన్ గా తనను అధ్యక్షునిగా ఎందుకు తప్పించాల్సి వచ్చిందో కూడా అర్థం కావడం లేదని మనసులోని బాధనంతా పార్టీ ముఖ్యల వద్ద వెళ్లగక్కారట సంజయ్.

Also Read: జగ్గారెడ్డి, రఘునందన్‌రావు మౌనం.. అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం

నిజానికి సంజయ్ పరిస్థితిపై బీజేపీలో సీనియర్లతోపాటు కార్యకర్తల్లోనూ సానుభూతి కనిపిస్తోంది. కానీ ఎవరూ ఏం చేయలేని పరిస్థితి. ఆయనకు మద్దతుగా కొందరు నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినా.. ఫలించలేదు. బండి స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. బండిని బాధ్యతల నుంచి తప్పించడానికి ఆయన ప్రత్యర్థులు చెప్పిన ప్రధాన కారణం పార్టీలో కొత్తగా చేరికలు ఉండటం లేదని.. అయితే ఈ ఫిర్యాదుపై బండి సుదీర్ఘ వివరణ ఇస్తున్నట్లు చెబుతున్నారు. తన హయాంలోనే ఎక్కువగా చేరికలు జరిగాయని.. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరలేదన్న కారణంతో తప్పించడం ఎంతవరకు కరెక్టు అని సంజయ్ ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. తాను ఎంతలా కష్టపడ్డానో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ (BL Santhosh), పార్టీ ఇన్‌చార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్‌కి తెలుసనని.. తెలంగాణలో బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేశానని, సీఎం పదవి కూడా వద్దన్నానని, అసలు అసెంబ్లీకే పోటీ చేయనని కూడా చెప్పానంటూ పెద్దల ముందు ఆవేదన చెప్పుకున్నారట.

Also Read: బీఆర్‌ఎస్‌తో బంధాన్ని కొనసాగించాలా, వద్దా.. తెలంగాణలో వామపక్షాల తర్జనభర్జన

సంజయ్‌లో అసంతృప్తి పెల్లుబుకుతున్నట్లు జరుగుతున్న ప్రచారం తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్గా మారింది. బండి బాధలో వాస్తవం ఉందని చాలా మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ, బీజేపీలో ఒకసారి నిర్ణయం జరిగిపోయాక మంచోచెడో పాటించడమేనని.. పునరాలోచన చేసే పరిస్థితి కూడా ఉండదని చెబుతున్నారు. మరోవైపు సంజయ్ ని కేంద్ర కేబినెట్ లోకైనా తీసుకుంటారా.. లేదా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఏదేమైనా తెరవెనుక ఏం జరగనుందో.. తెరపైకి ఏం రానుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు