జానారెడ్డిపై రాజగోపాల్‌రెడ్డి దూకుడు అందుకేనా? నెక్ట్స్‌ ఏంటి?

మొత్తం మీద ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్‌లో ఆయ‌న‌ది పెద్ద‌న్న పాత్ర‌. రాజ‌కీయాల‌కు రిట‌ర్మెంట్ ప్ర‌క‌టించాన‌ని పైకి చెబుతున్నా.. కీల‌క‌మైన విష‌యాల్లో మాత్రం త‌న‌దైన పాత్రే పోషిస్తున్నారు. ఇప్పుడు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అంశం అంతా ఆయ‌న చుట్టూనే తిరుగుతోంది. ఇన్నాళ్లు కాంగ్రెస్ భీష్మ‌పితామ‌హుడిగా.. పేరొందిన స‌ద‌రు నేత‌ను ధృత‌రాష్ట్రుడితో పోల్చుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

మ‌రోవైపు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి మాత్రం ఆ పెద్దాయ‌న‌ను ధ‌ర్మ‌రాజుతో పోల్చుతున్నాడంట. ఇంత‌కీ టీ-కాంగ్రెస్‌లో ఎవ‌రా పెద్ద మ‌నిషి..? ఆయ‌న పోషిస్తున్న‌ పాత్ర ఏంటి..? సీఎం చుట్టూ తిరగాల్సిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అంశం ఆయ‌న చుట్టే ఎందుకు తిరుగుతోంది..? వాచ్ దిస్ స్టోరీ.

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అంశం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. క్యాబినేట్ బెర్తు ద‌క్కించుకునేందుకు ఎవ‌రికి వారు త‌మ‌దైనశైలిలో ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం అంతా కాంగ్రెస్ పెద్ద‌లు.. భీష్మ‌పితామ‌హుడిగా చెప్పుకునే జానారెడ్డి చుట్టే తిరుగుతోందట. ఆయ‌న మాత్రం ఇప్ప‌టికే రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పాన‌ని చెప్పిన‌ప్ప‌టికి ప్రస్తుతం ఆయనను కాంగ్రెస్ హైకమాండ్.. సలహాదారుగా నియమించిందింది.

Also Read: వీరి వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారిందా? మంత్రి సమక్షంలోనే ఘర్షణపడిన తెలుగు తమ్ముళ్లు

స‌డెన్‌గా జానారెడ్డి ఎంట్రీ
ప్రభుత్వానికి కీల‌క‌మైన అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారు జానారెడ్డి. ఇదిలా ఉంటే ఆయ‌న ఇద్ద‌రు కుమారుల‌లో ఒక‌రు జైవీర్ రెడ్డి ఎమ్మెల్యేగా, మ‌రొక‌రు ర‌ఘువీర్‌రెడ్డి ఎంపీగా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌న శిష్యుడు శంక‌ర్ నాయ‌క్‌కు ఎమ్మెల్సీ ఇప్పించుకోగ‌లిగారు. ఇక ఇప్పుడు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ విష‌యంలో కూడా జోక్యం చేసుకుంటుండ‌టంతో ఆయ‌న చుట్టూనే రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.

రాష్ట్ర మంత్రివ‌ర్గంలో ప్ర‌స్తుతం ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భ‌ర్తీ చేసేందుకు ఈ మ‌ధ్య కాంగ్రెస్ అధిష్టానం ఫోక‌స్ పెట్టి.. టీ కాంగ్రెస్ ముఖ్య‌నేత‌ల‌తో సంప్ర‌దింపులు చేసింది. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు అంతా రెడీ అనుకున్న సంద‌ర్భంలో ఆల్ ఆఫ్ స‌డెన్‌గా జానారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాలంటూ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. దీంతో పాటు ఇత‌ర‌త్రా అంశాల కార‌ణంగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు బ్రేక్ ప‌డింది. ఏప్రిల్ 3న క్యాబినేట్ విస్త‌ర‌ణ చేయాల్సి ఉండ‌గా.. అది కాస్త ఏఐసీసీ స‌మావేశాల త‌ర్వాత రెండో వారంలో ఉంటుంద‌ని అంతా భావించారు.

కానీ ఇప్పుడు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కాస్త నిర‌వ‌దికంగా వాయిదా ప‌డింది. దీంతో మంత్రిప‌ద‌విపై గంపెడాశ‌లు పెట్టుకున్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి లోలోన ర‌గిలిపోతున్నార‌ట‌. ఇన్నాళ్లు వేచి చూసే ధోర‌ణి అవ‌లంభించిన రాజ‌గోపాల్ రెడ్డి .. ఇక మాట‌లు లేవ్‌.. మాట్లాడుకోవ‌డాలు లేవ్ అంటూ ఫైర్ అయ్యారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ బ్రేక్ ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణ‌ం జానారెడ్డినే అంటూ బ‌హిరంగ‌స‌భ వేదిక‌పై విరుచుకుప‌డ్డారు.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గానికి ఒక్కొక్క మంత్రి ఇంచార్జ్‌గా ప‌నిచేస్తే.. భువ‌న‌గిరికి మాత్రం ఒక ఎమ్మెల్యేగా తాను ఇంచార్జ్‌గా ఉంటూ గెలిపించానంటూ స్వ‌రం పెంచారు. అంతేకాదు జానారెడ్డిని టార్గెట్ చేస్తూ..ధ‌ర్మ‌రాజులా ధ‌ర్మంలా వ్య‌వ‌హ‌రించాల్సిన వ్య‌క్తి..ధృత‌రాష్ట్రుడిలా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. 30 ఏళ్లు మంత్రిప‌ద‌వి అనుభ‌వించిన జానారెడ్డికి..ఈ రోజు రంగారెడ్డి జిల్లా గుర్తుకువ‌చ్చిందా అంటూ ధ్వ‌జ‌మెత్తడం పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

జానారెడ్డిని ధ‌ర్మ‌రాజుతో పోల్చుతున్న రంగారెడ్డి జిల్లా నేత
కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి తీరు ఇలా ఉంటే.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలేమో జానారెడ్డిని ధ‌ర్మ‌రాజుతో పోల్చుతున్నారంట. జానారెడ్డి పెద్ద‌న్న‌లా వ్య‌వ‌హ‌రిస్తూ అంద‌రికి న్యాయం చేయాల‌నే తీరుతో ధ‌ర్మ‌రాజులా మాట్లాడుతున్నారని పొగడ్తలతో ముంచెస్తున్నారంట. మంత్రి ప‌ద‌వి కోసం రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం ఎమ్మెల్యే మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి శ‌త‌విధాల ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మంత్రిప‌ద‌వికి త‌న సామాజిక‌వ‌ర్గమే అడ్డొస్తే.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి బీసీ అభ్య‌ర్థిని గెలిపించుకుంటానంటూ కామెంట్స్ చేశారంట.

ఉమ్మ‌డి ప‌ది జిల్లాల‌కు ఒక్కొక్క‌టి చొప్పున మంత్రి ప‌ద‌వి ఇచ్చాక‌.. మిగ‌తా 8 ప‌ద‌వుల‌ను ఎవ‌రికైనా ఇచ్చుకోండి అనే డిమాండ్‌ను తెర‌పైకి తెస్తున్నారు. రాష్ట్ర జ‌నాభాలో 42 శాతం ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నార‌ని.. రెవెన్యూ ప‌రంగా అత్యంత కీల‌క‌మైన రంగారెడ్డి జిల్లాకు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అవ‌కాశం ఇవ్వాల‌ని అధిష్టానాన్ని కోరుతున్నారు. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంతో పాటు రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత కూడా రంగారెడ్డి, హైద‌రాబాద్ జిల్లాల నుంచి ఆరుగురికి అవ‌కాశం ద‌క్కింద‌ని..ఇప్పుడు క‌నీసం ఒక్క‌రికైనా ఇవ్వాల‌ని మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి ప‌ట్టుబ‌డుతున్నారు. అందుకే రంగారెడ్డి జిల్లాకు మంత్రిప‌ద‌వి కావాలంటూ పెద్ద‌లు జానారెడ్డిని సంప్ర‌దించి అధిష్టానానికి లేఖ రాయించారు.

మొత్తం మీద ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అంశం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు సెంట‌ర్‌గా పాయింట్ గా మారిన జానారెడ్డిని ధృతరాష్ట్రుడు, ధ‌ర్మ‌రాజుతో పోల్చుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ వ్య‌వ‌హారం ఎటువంటి టర్న్ లు తీసుకుంటోందో..మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి బెర్త్ దక్కుతుందా లేక మల్ రెడ్డి రంగారెడ్డికి దక్కుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్ డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్ ని ఫాలో అవ్వండి