Godavari Flood: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక.. 1976 నుంచి వరద వివరాలు పరిశీలిస్తే..

భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి ఉధృతి కారణంగా తెలంగాణ - ఛత్తీస్‌గడ్ ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరింది. దీంతో తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Bhadrachalam Godavari Flood

Bhadrachalam Godavari Flood: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గంటగంటకు నీటిమట్టం పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 9గంటల వరకు నీటిమట్టం 53.01 అడుగులకు చేరుకోగా.. ప్రస్తుతం శనివారం ఉదయం 9 గంటల వరకు 54.20 అడుగులకు నీటిమట్టం చేరింది. మరో ఎనిమిది గంటలపాటు ఇదే వరద పరిస్థితి కొనసాగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో సాయంత్రం వరకు 58 నుంచి 60 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 11,505 మంది బాధితులను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు అధికారులు పడవులు, బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. హెలికాప్టర్‌తో సహా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక ..

ప్రస్తుతం భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఇతర అధికారులు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లోని ఏటూరు నాగారం, పేరూరు నుంచి వరద వస్తుండటంతో రాత్రి 8గంటల వరకు దాదాపు 60 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గోదావరి ఉధృతి కారణంగా తెలంగాణ – ఛత్తీస్‌గడ్ ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరింది. దీంతో తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గత శతాబ్దం చరిత్రను పరిశీలిస్తే గోదావరి వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటిన ఘటనలు దాదాపు 20 సార్లు చోటు చేసుకున్నాయి. జూన్ నుంచి అక్టోబరు వరకు వరదల భయం పొంచి ఉంటుంది. ఎక్కువ సార్లు ఆగస్టులోనే గరిష్ఠ వరద పోటెత్తుతోంది. దీన్నిబట్టి చూస్తే మరో నెల పాటు గోదావరి నదీ పరివాహక ప్రజలకు ప్రమాదం పొంచి ఉందన్న వాదన ఉంది.

భద్రాచలం వద్ద గోదావరి నదిలో 1976 నుంచి వరదల వివరాలను పరిశీలిస్తే..

1976 (జూన్ 22న) 63.9 అడుగులకు నీటిమట్టం చేరింది.
1978 (సెప్టెంబర్ 2న) 54.2 అడుగులు.
1981 (ఆగస్టు 11న) 58.9 అడుగులు.
1983 (ఆగస్టు 14న) 63.5 అడుగులు.
1986 (ఆగస్టు 16న) 75.6 అడుగులు.
1988 (జులై 29న) 57.3 అడుగులు.
1990 (ఆగస్టు 24న) 70.8 అడుగులు.
1994 (సెప్టెంబర్ 7న) 58.6 అడుగులు.
1995 (అక్టోబర్ 22న) 57.6 అడుగులు.
2000 (ఆగస్టు 30న) 54.6 అడుగులు
2001 (ఆగస్టు 22న) 53.8 అడుగులు
2005 (సెప్టెంబర్ 20న) 54.9 అడుగులు
2006 (ఆగస్టు 6న) 66.9 అడుగులు
2007 (ఆగస్టు 10న) 53.7 అడుగులు
2010 (ఆగస్టు 8న) 59.7 అడుగులు
2013 (ఆగస్టు 3న) 61.6 అడుగులు
2014 (సెప్టెంబర్ 8న) 56.1 అడుగులు
2020 (ఆగస్టు 17న) 61.6 అడుగులు
2022 (జూలై 16న) 71.3 అడుగులు