Bhatti Vikramarka
Telangana: రంగారెడ్డి జిల్లా (Rangareddy), షాద్ నగర్ నియోజక వర్గంలో లక్ష్మీ దేవి పల్లి రిజర్వాయర్ ( Lakshmidevipalli Reservoir) పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
“కర్ణాటకలో మొదలైన కాంగ్రెస్ సునామీ మరికొన్ని నెలల్లోనే తెలంగాణను తాకబోతుంది. ఇక్కడనుంచి ఛత్తీస్‌గఢ్ కు, అక్కడనుంచి రాజస్థాన్, ఢిల్లీని తాకుతుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాపాలనను తీసుకువస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే లక్ష్మీ దేవి రిజర్వాయర్ ను వెంటనే ప్రారంభిస్తామని మాట ఇస్తున్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు రూ. 5లక్షలు ఇస్తాం. ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా.. 9 రకాల వస్తువులను అందిస్తాం. ఇంట్లో ఇద్దరికీ పింఛన్ ఇస్తాం.
ఆరోగ్య శ్రీ కార్డును ఇవ్వడమే కాకుండా.. దానిని రూ. 5 లక్షల వరకూ పెంచుతాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తాం. ప్రతి ఏడాది జాబ్ కేలండర్ ద్వారా నియామకాలు చేపడతాం. నిరుద్యోగ భృతి రూ. 4 వేలు ఇస్తాం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా కృష్ణా జలాల నీటి వినియోగ సామర్థ్యం పెరగలేదు.
ఏపీలో 570 టీఎంసీల వినియోగ సామర్థ్యం ఉంటే.. తెలంగాణ నికరజలాల కేటాయింపు 300 టీఎంసీలు కూడా వినియోగించడం లేదు. ఇది తెలంగాణ సమాజానికి కేసీఆర్ చేసిన దుర్మార్గమైన మోసం ఇది” అని భట్టి విక్రమార్క చెప్పారు.
లక్ష్మీ దేవి పల్లి రిజర్వార్ పూర్తి చేయాల్సిందేనని భట్టి విక్రమార్క్ అన్నారు. “లక్ష్మీ దేవి పల్లి రిజర్వార్ పూర్తి చేయాలి.. షాద్ నగర్ నియోజకవర్గంలోని మండలాలకు, రంగారెడ్డి జిల్లాలోని మండలాలకు, నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు తాగు, సాగు నీరు సౌకర్యం కలుగుతుంది. దురదృష్టం ఏమో కానీ నీళ్ల కోసం తెచ్చుకున్న తెలంగాణలో దశాబ్దకాలం అవుతున్నా.. నీళ్లు పారడం లేదు.
నిధులున్నాయి… నదుల్లో నీళ్లున్నాయి.. అయినా రిజర్వాయర్ కట్టడం లేదు. రాష్ట్రాన్ని పాలించే పెద్ద మనిషికి ప్రజలు బాగుండాలని ఏ మాత్రం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాలు, పాలకులు మాత్రమే ప్రజల కోరికలను, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని పాలించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆదిలాబాద్ లోనూ, కరీంనగర్ జిల్లాలోనూ.. లేదా మరో చోట ఎక్కడా భూములు లేవు.
నేను వెళ్లిన ప్రతిచోటా.. ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతులు అందరూ ఒక్కటే మాట చెప్పారు.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టి ఉంటే.. తెలంగాణ వచ్చిన తొలి మూడేళ్లలోనే నీళ్లు పారేవి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ చంపేశారు. రూ.లక్షల కోట్లు ఖర్చు చేశారు.. కానీ కొత్తగా ఒక్క ఎకరాకు ఒక్క నీళ్లు ఇచ్చింది లేదు.
గోదావరి, కృష్ణాలోనే నీళ్లు రాకుండా కేసీఆర్ చేసిన కుట్ర వల్లే తెలంగాణ నీటి కోసం ఇబ్బందులు పడుతోంది. ఆంధ్రా పాలకుల వల్ల మనకు నీళ్లు రావడం లేదని తెలంగాణ తెచ్చుకున్నాం. రాష్ట్రం వచ్చి పదేళ్లవుతున్నా.. కొత్త ప్రాజెక్టులు కట్టుకోలేక పోయాం. కృష్ణానది నుంచి ఈ తొమ్మిదేళ్లలో కేసీఆర్ కొత్తగా ఒక్క ఎకరానికి కూడా సాగునీళ్లు ఇవ్వలేదు. కల్తకుర్తి, కోయిల్ సాగర్, నెట్టుంపాడు, భీమా ప్రాజెక్టును కాంగ్రెస్ కట్టి.. పొలాలను కాలువల ద్వారా నీళ్లు అందించింది” అని భట్టి విక్రమార్క అన్నారు.