Pawan Kumar Case: హైదరాబాద్ లో కుక్క కరిచి చనిపోయిన వ్యక్తి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు నిజం ఏంటో బయటకు వచ్చింది. హైదరాబాద్ మధురానగర్ కు చెందిన పవన్ కుమార్ మృతి కేసులో మిస్టరీ వీడింది. అనారోగ్య సమస్యతోనే పవన్ మృతి చెందినట్టు నిర్ధారణ అయ్యింది. పెంపుడు కుక్క పవన్‌ను కాపాడే ప్రయత్నం చేసిందని తేలింది.
యజమానిని కాపాడే ప్రయత్నంలో పవన్ ఒంటిపై కుక్క కాట్లు ఉన్నాయని నిర్ధారించారు. అయితే, పెంపుడు కుక్క తన యజమానిని చంపేసిందని తొలుత వార్తలు వచ్చాయి. కుక్క మూతి నిండా రక్తం ఉండటం, పవన్ మర్మాంగాలపై గాయాలు ఉండటం ఈ అనుమానాలకు తావిచ్చింది. పోలీసుల విచారణలో నిజం బయటపడింది. పవన్ మృతికి కారణం కుక్క కాదు అనారోగ్యం అని తేలింది.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ మధురానగర్ లో పవన్ కుమార్ నివాసం ఉంటాడు. అయితే, రెండు రోజులుగా అతడు బయటకు రాలేదు. దీంతో అతడి స్నేహితుడు పవన్ ఇంటికి వెళ్లాడు. కాలింగ్ బెల్ కొట్టాడు. ఎంత సేపు అయినా పవన్ డోర్ తీయలేదు. దీంతో కంగారుపడ్డ అతడు.. స్థానికుల సాయంతో డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతడు బిత్తరపోయాడు.
పవన్ కుమార్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. పవన్ పెంపుడు కుక్క నోటికి పూర్తిగా రక్తం కనిపించింది. అతడి మర్మాంగాలపై కుక్క దాడి చేసిన గుర్తులు ఉన్నాయి. దీంతో భయపడిపోయిన పవన్ స్నేహితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెంపుడు కుక్క దాడి చేయడంతోనే పవన్ చనిపోయాడని తొలుత అంతా అనుకున్నారు.
కుక్క తన యజమానిని కొరికి చంపేసిందనే వార్తలు వచ్చాయి. అదే నిజమని అంతా అనుకున్నారు. కానీ, పోలీసుల విచారణలో వాస్తవం వెలుగులోకి వచ్చింది. పవన్ మృతి కారణం అతడి పెంపుడు కుక్క కాదు అనారోగ్యం అని తేలింది. అంతేకాదు.. పవన్ ను అతడి పెంపుడు కుక్క కాపాడే ప్రయత్నం కూడా చేసిందట.