Alleti Maheshwar Reddy : ఎందుకు భయపడుతున్నావ్? సీఎం రేవంత్ పై ఆలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్
Alleti Maheshwar Reddy : సింగరేణిలో అవినీతి లేకుంటే బీజేపీ పరిశీలనకు వెళ్తే నీకు భయమెందుకు? బొగ్గు లెక్కలు అన్ని చక్కగా ఉంటే ప్రజాప్రతినిధులను గనుల ప్రాంతాలకు ఎందుకు వెళ్లనివ్వడం లేదో చెప్పాలని ఆలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
- Sreehari A
- Updated on- June 20, 2026 / 06:34 PM IST
Eleti Maheshwar Reddy
Alleti Maheshwar Reddy : సింగరేణి భరోసా యాత్రను రేవంత్ సర్కార్ అడ్డుకోవడంపై తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది. సింగరేణి ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన బీజేపీ నేతలను అడ్డుకోవడంపై బీజేఎల్పీ నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
యాత్రను అడ్డుకోవడం చూస్తుంటే రేవంత్ ఎందుకో భయపడుతున్నట్టు కనిపిస్తోందన్నారు. మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సింగరేణి ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించాలని భావించారు.
అందులోనూ బొగ్గు నిల్వలు, కార్మికుల సమస్యలతో పాటు పెండింగ్ బిల్లులు, పరిపాలనా వ్యవహారాలపై వాస్తవాలను తెలుసుకోవడమే బీజేపీ లక్ష్యమని కూడా ప్రకటించింది. కానీ, రేవంత్ ప్రభుత్వం చర్చకు రాకుండా పోలీసులతో తమ యాత్రను అడ్డుకుందని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మహేశ్వర్ రెడ్డి పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు.
“సింగరేణిలో అవినీతి లేకుంటే బీజేపీ పరిశీలనకు వెళ్తే నీకు భయమెందుకు? బొగ్గు లెక్కలు అన్ని చక్కగా ఉంటే ప్రజాప్రతినిధులను గనుల ప్రాంతాలకు ఎందుకు వెళ్లనివ్వడం లేదు? సింగరేణి అనేది తెలంగాణ ప్రజల ఆస్తి.. అక్కడి పరిస్థితిని తెలుసుకునే హక్కు ప్రజాప్రతినిధులకు లేదా?’ అని సూటిగా ప్రశ్నించారు.
అలాగే, సింగరేణిలో సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలతో పాటు దాదాపు రూ.1,600 కోట్ల విలువైన అవినీతి అక్రమాలపై ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి వివరాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Alleti Maheshwar Reddy
టెండర్లు, రవాణా వ్యవస్థ, బొగ్గు నిల్వలు, ఓవర్‌బర్డన్ పనులు, స్టాక్ పాయింట్లు, పెండింగ్ బిల్లుల అంశాలపై కూడా సమగ్ర విచారణ జరపాలన్నారు. బొగ్గు నిల్వలు ఉంటే అవి ఎక్కడో చూపించాలన్నారు. లేదంటే దానికి బాధ్యులెవరో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ఇతర ప్రతిపక్ష నేతలను సింగరేణి ప్రాంతాలను సందర్శించేందుకు అనుమతినిచ్చి ఇప్పుడు బీజేపీ నేతలను మాత్రమే ఎందుకు అడ్డుకుంటారు? దీని వెనుక ఏమైనా రాజకీయ కారణాలున్నాయా? అని ఆయన ఆరోపించారు. “హరీష్ రావు, కవిత మాత్రం సింగరేణి ప్రాంతాలకు వెళ్లవచ్చు. కానీ, బీజేపీ నేతలు ఎందుకు వెళ్లకూడదు?” చెప్పాలని ప్రశ్నించారు. ఇది రాజకీయ వివక్షకు నిదర్శనమే అంటూ ధ్వజమెత్తారు.
రైతు గోస కార్యక్రమాన్ని మహేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా ఉదాహరణగా ప్రస్తావించారు. సింగరేణి భరోసా యాత్ర ద్వారా కార్మికుల సమస్యలు, బొగ్గు లెక్కలన్నీ ప్రజల ముందు పెడతామని చెప్పారు. రైతుల సమస్యలతో పాటు సింగరేణి అంశంలో కూడా వాస్తవాలు బయటకు వచ్చేవరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
