Political Rrr
Political RRR: తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ గెలుపుతో భారతీయ జనతా పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. టీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో చివరికి గెలుపు బీజేపీని వరించగా.. బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా బీజేపీ కార్యకర్తలు టపాసులు కాల్చి సందడి చేశారు.
ఈ క్రమంలోనే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ వద్ద బీజేపీ కార్యకర్తలు హల్ చల్ చేశారు. RRR స్టికర్ అంటించిన వాహనంలో బీజేపీ కార్యకర్తలు ప్రగతి భవన్ వద్దకు వెళ్లారు. వాహనంపై బండి సంజయ్‌తో పాటు ఎమ్మెల్యేలు రాజసింగ్, రఘనందనరావు, రాజేందర్ ఈటల ఫొటోలు ఉండగా.. ట్రిపుల్ ఆర్ సినిమా చూడు కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
అయితే, బీజేపీ కార్యకర్యలను అరెస్ట్ చేయకుండా పోలీసులు పంపించేశారు. అక్కడి నుంచి బీజేపీ కార్యకర్తలు బల్కంపేట్ ఎల్లమ్మ గుడిలో మొక్కులు చెల్లించుకున్నారు. నవంబర్ 2న ప్రగతి భవన్ వద్ద ట్రిపుల్ ఆర్ సినిమా చూపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే కార్యకర్తలు ప్రగతి భవన్ వద్దకు వచ్చినట్లుగా తెలుస్తుంది.