కేసీఆర్ కుటుంబానికి వాత పెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధం : రఘునందన్‌రావు

బీఆర్ఎస్ అగ్ర నేతలు ఏనాడు కార్యకర్తలను గౌరవించలేదని విమర్శించారు. పదేళ్ల నుంచి కార్యకర్తలను గౌరవించుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని హితవు పలికారు.

BJP Leader Raghunandan Rao

Raghunandan Rao: కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, అన్ని సర్వేలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్టేనని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చినపుడే తెలంగాణ ప్రజలతో కేసీఆర్ పేగు బంధం తెగిపోయిందన్నారు. బీజేపీపై ఉత్త మాటలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. 17 పార్లమెంట్ స్థానాల్లో అందరికంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని, డబుల్ డిజిట్ సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తింపు కోల్పోడం ఖాయమన్నారు.

మీడియాలో స్పేస్ కోసమే సమీక్షలు నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ నాయకులు హడావుడి చేస్తున్నారని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అగ్ర నేతలు ఏనాడు కార్యకర్తలను గౌరవించలేదని విమర్శించారు. పదేళ్ల నుంచి కార్యకర్తలను గౌరవించుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని హితవు పలికారు. ఇంతకాలం సంపాదించింది ఎక్కడ దాచుకోవాలి, ఎంపీ టిక్కెట్లు ఎలా అమ్ముకోవాలని బీఆర్ఎస్ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో డబ్బున్న వారికి టిక్కెట్లు అమ్ముకుంటారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు, సంతోష్ కుమార్.. ఎంపీలుగా పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమన్నారు.

Also Read: తెలంగాణ ప్రజలు ఈ నెల విద్యుత్ బిల్లులు కట్టొద్దు.. ఇలా చేయండి: కేటీఆర్

బీఆర్ఎస్ ఎందుకు ఓటు వేయాలని రఘునందన్ రావు ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయని.. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఏం లాభమని అడిగారు. బీఆర్ఎస్ పార్టీకి వేసే ప్రతి ఓటు మూసీ నదిలో వేసినట్టేనని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు కళ్లు తెరవాలంటే భారత రాష్ట్ర సమితికి ఒక సున్నా చుట్టాల్సిన అవసరం ఉందని ప్రజలకు విన్నవించారు.

”పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిగ్ జీరోగా నిలవబోతోంది. కేసీఆర్ కుటుంబానికి వాత పెట్టడానికి తెలంగాణ సమాజం రెడీగా ఉంది. తెలంగాణతో పేగు బంధమున్న శంకరమ్మకు కేటీఆర్ లోకసభ సీటు ఇవ్వగలరా? పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా వందల కోట్లు ఉన్న వారికే బీఆర్ఎస్ లోకసభ సీట్లు ఇస్తుంది. కృష్టా నీటిలో 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకుంది కేసీఆర్ కాదా? కృష్టాజలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకుపోలేదు? ఎన్నికలప్పుడే హరీశ్‌రావుకు మోటార్లకు మీటర్లు గుర్తొస్తాయి. వంద కోట్లకు లోకసభ సీట్లు అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. బీజేపీ ఎక్కడుందో మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో హరీశ్‌కు చూపిస్తా. 1998లోనే మెదక్ పార్లమెంట్ సీటును బీజేపీ గెలిచిన విషయం హరీశ్ గుర్తుంచుకోవాల”ని రఘునందనరావు అన్నారు.