Goshamahal MLA MLA Rajasingh
బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి తనను నామినేషన్ వేయనివ్వలేదని అన్నారు. నామినేషన్ వేయడానికి వెళ్తే తన మద్దతుదారులను బెదిరించారని తెలిపారు. నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయనివ్వలేదని అన్నారు.
రామచందర్‌రావుకు అధ్యక్ష పదవిపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని రాజాసింగ్ చెప్పారు. తన రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించానని తెలిపారు. తనకు సంబంధించిన ఈ విషయంలో లక్షలాది మంది కార్యకర్తలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీకి అధ్యక్షుడు ఎవరు కావలనేది ముందే డిసైడ్ అయి ఎన్నిక ప్రక్రియ చేపట్టారని ఆరోపించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావును ఎన్నుకోవాలన్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజాసింగ్.. ఈ పరిణామం తనకే కాక, లక్షలాది కార్యకర్తలు, నాయకులు, ఓటర్లకు నిరాశ కలిగించిందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ తొలిసారి అధికారంలోకి రావాలన్న సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ తీరుపై అనుమానాలు పెంచుతుందని చెప్పారు.
పార్టీ ఎదుగుదల కోసం కష్టపడిన అనుభవజ్ఞులైన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నప్పటికీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు నేతలు కేంద్ర నాయకత్వాన్ని తప్పుదారి పట్టించారని విమర్శించారు. ఈ చర్యలు కార్యకర్తల త్యాగాలను అవమానించడమేనన్నారు.
తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో గెలిచానని చెప్పారు. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండలేనని, అంతా బాగుందని నటించలేనని చెప్పారు.
ఇది వ్యక్తిగతంగా పదవుల కోసం కాదని, కార్యకర్తలు ఎదుర్కొంటున్న బాధను ప్రతిబింబించే చర్య అని వివరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి మంచి అవకాశం ఉన్నప్పటికీ నాయకత్వ నిర్ణయాలతో నిరాశ నెలకొంటోందని చెప్పారు. తాను బాధతోనే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.