Bandi Sanjay: బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నడవడం కష్టం. సీఎం రమేష్ చెప్పింది వాస్తవమేనని అన్నారు.
కేసీఆర్ తన కొడుక్కి మొదట టికెట్ ఇవ్వలేదు. సిరిసిల్లలో కేటీఆర్‌కు టికెట్ ఇప్పించింది సీఎం రమేష్. ఆయన వల్లే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాడు. కేటీఆర్‌కు ఆయన ఆర్థిక సహాయంకూడా చేశారని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసుకునేది లేదు. బీఆర్ఎస్ అంటే.. బిడ్డా, అల్లుడు, కొడుకు.. అయ్య పార్టీ. ఆ పార్టీ నడిపే స్థితిలో లేరు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి.. పార్టీని నడపడం వారికి చేతకావడం లేదని బండి సంజయ్ అన్నారు.
తేదీ నువ్వే చెప్పు కేటీఆర్..
సీఎం రమేష్ సవాల్ కు కేటీఆర్ సిద్ధమా.. లేదా అనేది చెప్పాలి. ఆయనతో కేటీఆర్ చర్చకు వస్తారా.. నేను మధ్యవర్తిగా ఉంటా. కరీంనగర్ లోనే వేదిక ఏర్పాటు చేస్తా. సీఎం రమేష్ ను తీసుకొస్తా. నువ్వు వస్తావా కేటీఆర్..? తేదీ నువ్వే చెప్పు.. మేము రెడీ. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామన్నది వాస్తవం కాదా..? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.
సీఎం రమేష్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. కేటీఆర్ బాష సరిగా లేదు. సంస్కారంలేని సంస్కారహీనుడు అతను. ముఖ్యమంత్రిని హౌలే, వాడు, వీడు అనడం కరెక్ట్ కాదు. పోలీసులను పోలీసోడు అనడం కరెక్ట్ కాదు. కేటీఆర్ నీ బాష మార్చుకో. నేను హోం మినిస్టర్‌ను ఇలా చెప్పొద్దు.. కానీ, చెప్పాల్సి వస్తుంది.. నీ బాష తీరు మార్చుకోకపోతే దాడులు చేస్తాం అంటూ బండి సంజయ్ హెచ్చరించారు. వంద యూట్యూబ్ ఛానెళ్లు పెట్టుకొని హద్దులు మీరుతావా.. చూస్తూ ఊరుకోం అని బండి సంజయ్ అన్నారు.