అప్పటి నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదు.. దాని వెనుక ఉన్న లాలూచి ఏంటో కేటీఆర్ చెప్పాలి: రఘునందన్ రావు

పదేళ్లు రాష్ట్ర మున్పిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోలేదని, ఆయనను మొదటి ముద్దాయిగా అరెస్టు చేయాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

bjp mp raghunandan rao: హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ మాదవనేని రఘునందన్ రావు స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగించాలన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు డ్రామాలు రక్తికట్టించేలా మాట్లాడుతున్నారని.. చెరువుల పరిరక్షణపై ఏ పార్టీ ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పదేళ్లు రాష్ట్ర మున్పిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోలేదని, ఆయనను మొదటి ముద్దాయిగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

”తెలంగాణ ప్రజల భూములు మాకే ఇవ్వాలని బీఆర్ఎస్ నినాదం చేసింది. గురుకుల భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటామని అప్పుడు ప్రభుత్వం రెడ్ ఇంక్ తో మార్క్ చేసింది. ఎన్ కన్వెన్షన్‌ను 2014లో కూల్చివేయమని హైకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి. దాని వెనుక ఉన్న లాలూచి ఏంటో కేటీఆర్ చెప్పాలి. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా అధికారులతో కలిపి అధికారుల కమిటీ వేశారు. హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల పరిరక్షణకు కమిటీ వేశారు. కేటీఆర్ పొంగులేటి, పట్నం, వంటి నేతల పేర్లు చెబుతున్నారు. ముందు నీ జన్వాడా ఫాంహౌస్ జేసీబీతో కూల్చి వేయండి. కవిత, కేటీఆర్ ఫాంహౌస్‌ను కూల్చేందుకు ఎందుకు భయపడుతున్నారు?

Also Read: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల్లో ట్విస్ట్.. మంత్రి ఫిర్యాదుతోనే రంగంలోకి హైడ్రా బృందం!

2014 నుంచి నేటి వరకు ఎన్ కన్వెన్షన్ ద్వారా వచ్చిన నగదును ముక్కుపిండి వసూలు చేయాలి. హైడ్రా వేసింది మంచి ఉద్దేశ్యంతో అయితే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన అక్రమ కట్టడాలు కూల్చివేయాలి. నగరంలో ఏ కుంట, ఏం చెరువు ఎంత కబ్జా అయ్యిందో లెక్క తీయాలి. కబ్జాలకు పాల్పడిన నేతలపై కేసులు పెడితే వారిని ఎందుకు అరెస్టు చేయలేదు? హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ గుర్తించమని ఎన్జీటీ చెప్పినా ఇప్పటికీ చేయలేదు. చెరువుల బఫర్ జోన్‌ను గుర్తించాలని హైకోర్టు చెప్పింది. రాజభవన్ రోడ్‌లో నాలాలపై ఆసుపత్రి కట్టారు.. భారీ భవనాలను నిర్మించారు. హైడ్రాకు రాజకీయ దురుద్దేశం లేకపోతే చెరువుల బఫర్ జోన్‌ను గుర్తించి కాపాడాల”ని రఘునందన్ రావు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు