BJP: బీజేపీ హంగ్ ఆశలు.. ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయం!

తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలుగంటున్న బీజేపీ.. సరికొత్త లెక్కలు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడబోతోంది అంటూ ప్రచారం మొదలుపెట్టింది కమలం పార్టీ.

BJP predicting hung assembly in Telangana and saffron party confident to power

BJP Telangana: ఎన్నికలు వస్తున్నాయంటే.. ప్రతి పార్టీ సర్వే చేయిస్తుంటుంది.. వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ చెప్పుకుంటుంది.. సర్వేల్లో ప్రతికూల ఫలితం వచ్చినా.. తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటూ పరిస్థితులను సానుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు నేతలు. కానీ తెలంగాణలో ఓ జాతీయపార్టీ మాత్రం కొత్త పల్లవి అందుకుంది.. తమకు ఆధిక్యం రాదని.. అయినా అధికారం మాత్రం తమదేనని చెప్పుకుంటోంది. మెజార్టీ రాకుండా ప్రభుత్వం ఏర్పాటు ఎలా? ఇంతకీ ఈ కొత్త స్ట్రాటజీ ఆవిష్కరించిన నేత ఎవరు? ఆయనేం చెప్పారు? తెరవెనుక ఆ పార్టీ వ్యూహమేంటి?

తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలుగంటున్న బీజేపీ.. సరికొత్త లెక్కలు వేస్తోంది.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడబోతోంది అంటూ ప్రచారం మొదలుపెట్టింది కమలం పార్టీ.. బీజేపీ సర్వేల ప్రకారం రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని బీజేపీ నేత బీఎల్ సంతోష్ ప్రకటించారు. తెలంగాణాలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటవుతుందని.. బీజేపీయే అధికారంలోకి వస్తుందని చెప్పిన బీఎల్ సంతోష్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు. రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీఎల్ సంతోష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాక పోవడం వరకు ఓకే గానీ.. హంగ్ లో బీజేపీ కింగ్ ఎలా అవుతుందో అర్థం కాక కాషాయదళమే మల్లగుల్లాలు పడుతోందట.

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉన్న అధికార బీఆర్ఎస్‌ను.. ఈ సారి ఓడించి గద్దెనెక్కాలని కాంగ్రెస్, బీజేపీ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే .. ఏవైనా రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కావాలంటే ఏడు సీట్లకు అటూ ఇటూ ఉండే ఎంఐఎం మద్దతు కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే బీజేపీతో ఎంఐఎం జట్టు కట్టే ఛాన్స్ ఎంతమాత్రం ఉండదు. సో.. మరో పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సివుంటుంది.

ఇక బీజేపీ కాంగ్రెస్ కూడా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలూ లేవు. ఇక మిగిలింది బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.. ఎన్డీయేలో చేరుతామని కేసీఆర్ వచ్చినా.. తాము చేర్చుకోలేదంటూ ప్రధాని మోడీనే స్వయంగా ప్రకటించారు. అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్‌లోనూ మద్దతు ఇవ్వలేమని చెప్పేశారని స్పష్టంగా తెలిపారు ప్రధాని.. ఈ పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలూ కలవడం అసాధ్యం.. ఈ లెక్కన బీజేపీ ఎలా అధికారంలోకి రాగలుగుతుందనేది ఆసక్తి రేపుతోంది. ఐతే బీజేపీ చేతిలో ఓ బ్రహ్మస్త్రం ఉందని.. అది ప్రయోగించి అధికారంలోకి రావాలనే కలలు నిజం చేసుకునే చాన్స్ ఒకటుందని అంటున్నారు పరిశీలకులు.. ఆ బ్రహ్మస్త్రమే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడం.

Also Read: కాంగ్రెస్ పార్టీతో కోదండరాం చర్చలు.. తమ పార్టీకి ఎన్ని సీట్లు అడిగారో తెలుసా?

ఎమ్మెల్యే కొనుగోలు అంటూ ఇప్పటికే బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య మొయినాబాద్ ఫాంహౌస్ కేసు నడిచింది. ఇది ఇంకా పెండింగ్‌లో ఉండగా.. వచ్చే ఎన్నికల తర్వాత ఏ పార్టీ అయినా ఇంకోపార్టీని చీల్చే ప్రయత్నం చేస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ వ్యాఖ్యలను మాత్రం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఓ హెచ్చరికగానే భావిస్తున్నాయి. గతంలో వివిధ రాష్ట్రాల్లో హంగ్ అసెంబ్లీలు ఏర్పాటైతే బీజేపీ ఎలా అధికారంలోకి వచ్చింది గుర్తు చేసుకుంటున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్.. బీజేపీ వ్యవహారాలపై ఇప్పటి నుంచే నిఘా వేస్తున్నాయి.

Also Read: అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యుల్ ఖరారు, ఒకేరోజు రెండు సభలు

మరోవైపు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కలలను ఒక్కముక్కలో కొట్టేస్తున్నారు మంత్రి హరీశ్‌రావు.. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే బీజేపీని డకౌట్ చేశామని.. ఇక ఎన్నికల పోరులో కాంగ్రెస్‌ను రనౌట్ చేస్తామని క్రికెట్ పరిభాషలో సింపుల్‌గా తేల్చేశారు హరీశ్‌రావు. ఏది ఏమైనా బీజేపీ టాప్ లీడర్ సంతోష్ వ్యాఖ్యలు మాత్రం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కలవరం పుట్టిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. అంటే రెండు పార్టీల ముఖ్యనేతలు హై అలర్ట్‌గా ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చారనేది పరిశీలకుల అభిప్రాయం.