Botsa Satyanarayana: మా రాష్ట్రం గురించి మాకు తెలుసు.. మీ రాష్ట్రాన్ని మీరు చూసుకోండి.. ఇలాగేనా మాట్లాడేది?: బొత్స

హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చారు.

Botsa Satyanarayana

Botsa Satyanarayana: తెలంగాణ మంత్రి హరీశ్ రావు (Harish Rao) పై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పిన వైసీపీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత దానిగురించి మాట్లాడడంలేదని హరీశ్‌ రావు విమర్శించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరికి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందని అన్నారు. దీంతో ఏపీ మంత్రులు మండిపడుతున్నారు.

రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ అంశంపై ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఇవాళ రాష్ట్ర మంత్రులు సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. హరీశ్ రావు రాజాకీయాల కోసం ఏదైనా‌ మాట్లాడతారని చెప్పారు.

“హరీశ్ రావుకు ఏం సంబంధం ఉందని ఏపీ గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడడానికి హరీశ్ రావు ఎవరు?బాధ్యతగల వ్యక్తులు బాధ్యతగుర్తెరిగి మాట్లాడాలి. మా రాష్ట్రం గురించి మాకు తెలుసు.. మీ రాష్ట్రం మీరు చూసుకోండి” అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కూడా బొత్స విమర్శలు గుప్పించారు. “చంద్రబాబు గతంలో ఏం ఉద్ధరించారు? ఆయన చేసిన ఒక్క అభివృద్ధి చెప్పమనండి. వైఎస్, జగన్ హయాంలో చేసినవి నేను చెబుతా. రైతులకు, సమాన్యులకు,‌ పేదల కోసం ఏం చేశామో చెబుతా. చంద్రబాబు ఒక రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆయన ఉనికి కోసం కాపాడుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడతారు. మేము చేసింది చేయబోయేదే చెబుతాము. చంద్రబాబు లాగా అసత్యాలు చెప్పం” అని అన్నారు.

ఇవాళ నిర్వహించిన సమావేశంపై బొత్స సత్యనారాయణ స్పందిస్తూ… “జోన్లు, స్థానికత అంశంపై సమావేశం నిర్వహించాం. ఒక డ్రాఫ్ట్ తయారు చేశాం. త్వరలోనే ఉద్యోగులతో చర్చించి క్యాబినెట్ లో పెడతాం” అని స్పష్టం చేశారు. కాగా, ఏపీలో రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికతకు సంబంధించిన రిజర్వేషన్ల అంశాన్ని మార్చడానికి వీల్లేదని వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఉత్తర్వుల సవరణ జరిగేవరకు ఏపీలో జిల్లాలను విభజించే అధికారం లేదన్న అంశంపై హైకోర్టులో కేసు కొనసాగుతోంది.

Lella Appi Reddy : ముందు మీ ప్రజలను పట్టించుకోండి.. హరీశ్ రావుకు ఏపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కౌంటర్