Boyinpally Medha School case
Medha School Case : సికింద్రాబాద్ బోయిన్‌పల్లి మేధా పాఠశాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేధా పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఆ పాఠశాలలో చదివే విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పాఠశాల అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.
పాఠశాల సీజ్ అయినట్లు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. టీసీ ఇస్తే ఇతర పాఠశాలల్లో చేర్పించుకుంటామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కోరారు.
పాఠశాలను సీజ్ చేశారన్న విషయం తెలియదు. నిన్న ఎగ్జామ్ ఉందని మెసేజ్ వచ్చింది. పిల్లల 70శాతం ఫీజు చెల్లించాము. వేరే స్కూల్లో జాయిన్ చేస్తామని మాకు ఎవరు చెప్పాలి..? ఒకవేళ జాయిన్ చేస్తే ప్రభుత్వ పాఠశాలలో చేసే దానికి మేము ఎందుకు డబ్బులు కట్టి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయిస్తాం.. మా పిల్లల బాధ్యత నిర్వాకానికి పాల్పడిన జయప్రకాష్ గౌడే చూసుకోవాలి. తొమ్మిది, పదో తరగతి చదివే పిల్లల పరిస్థితి ఏంటి..? వేరే స్కూల్లో మా పిల్లలను జాయిన్ చేయించుకుంటారా..? మళ్లీ అక్కడ ఫీజు అడిగితే మేమే కదా నష్టపోతాం.. మాకు న్యాయం జరగాలి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి, ప్రభుత్వం తమను, తమ పిల్లల భవిష్యత్తును ఆదుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.
హైదరాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో మేధా పేరుతో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మలేల జయప్రకాశ్ గౌడ్ పాఠశాలను నిర్వహిస్తున్నాడు. పాఠశాల రెండో అంతస్తులోని రెండు గదుల్లో పరికరాలను ఏర్పాటు చేసి.. అల్ప్రాజోలం తయారీ దందాకు తెరలేపాడు. తయారు చేసిన అల్ప్రాజోలంను మహబూబ్ నగర్ జిల్లా భూత్పూరు మండలంలోని వివిధ ప్రాంతాల్లోని కల్లు దుకాణాలకు సరఫరా చేస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఈగల్ బృందం శనివారం పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేసింది. జయప్రకాశ్ గౌడ్, అతడికి సహకరిస్తున్న బోయిన్ పల్లికి చెందిన పెంటమోల్ ఉదయ్ సాయి, గౌటె మురళిలను అదుపులోకి తీసుకుంది. ఆదివారం విద్యాశాఖ అధికారులు పాఠశాలను సీజ్ చేశారు. పాఠశాల అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. పాఠశాల సీజ్ చేసినట్లు సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ప్రస్తుతం తమ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.