కుమార్తె కాళ్లు కడిగి కన్యాదానం చేసిన తండ్రి.. ఆ తరువాత గుండె పోటుతో..

పెండ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. కుమార్తె కాళ్లు కడిగి కన్యాధానం చేసిన కొద్దిసేపటికే తండ్రి..

bride father died

Heart Attack: కుమార్తె పెండ్లి జరుగుతుంది.. తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులు సంతోషంగా పెండ్లి వేడుకలో పాల్గొన్నారు. కుమార్తె తండ్రి.. పెండ్లికి వచ్చిన అతిధులను, బంధువులు, స్నేహితులను పలుకరిస్తూ హడావుడిగా ఉన్నారు. పెండ్లి తంతులో భాగంగా కుమార్తె కాళ్లు కడిగి కన్యాదానం చేశాడు. అంతా సక్రమంగా జరుగుతున్న క్రమంలో పెండ్లి వేడుకలో ఒక్కసారిగా విషాద ఘటన చోటు చేసుకుంది. కుమార్తె కాళ్లు కడిగి కన్యాదానం చేసిన తండ్రి గుండెపోటుతో పెండ్లి పందిరిలోనే కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్ పరిణామంతో కంగుతిన్న కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే తేరుకొని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను చనిపోవడంతో పెళ్లి వేడుక విషాదాంతంగా మారింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

Also Read: SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం.. కూలిన పైకప్పు.. టన్నెల్ లోపల చిక్కుకున్న కూలీలు..

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లికి చెందిన కుడిక్యాల బాల్ చంద్రం (54) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నాడు. అతనికి కనక మహాలక్ష్మీ, కళ్యాణలక్ష్మి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కనక మహాలక్ష్మికి పెండ్లి కుదరడంతో బీటీఎస్ సమీపంలోని ఓ ఫామ్ హౌజ్ లో శుక్రవారం పెండ్లి వేడుకను నిర్వహించారు. పెండ్లి వేడుకలో భాగంగా బాల్ చంద్రం కూతురు కాళ్లు కడిగి కన్యాదానం చేశాడు. అప్పటి వరకు సంతోషంగా సాగిన పెండ్లితంతులో కొద్దిసేపటికే విషాదం చోటుచేసుకుంది. పెండ్లి కుమార్తె తండ్రి గుండెపోటుతో పెండ్లి మండపంలోనే కుప్పకూలిపోయాడు. హుటాహుటీన కుటుంబ సభ్యులు బాల్ చంద్రంను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. అప్పటి వరకు సందడిగా ఉన్న పెండ్లి మండపంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read: Planetary Parade : గెట్ రెడీ.. ఆకాశంలో మహాద్భుతం జరగబోతుంది.. ఏంటా అద్భుతం, ఏమిటి దాని ప్రత్యేకత..

అందరూ సంతోషంగా ఉన్న సమయంలో పెండ్లి కుమార్తె తండ్రి మరణంతో ఆ ప్రాంతంలో విషాదం ఛాయలు అలముకున్నాయి. వధువు కుటుంబ సభ్యులు, బంధువుల రోధనలతో పెళ్లి మండపం శోకసంద్రమైంది. ఈ ఘటన చూపరుల హృదయాలను కలిచివేసింది.