SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం.. కూలిన పైకప్పు.. టన్నెల్ లోపల చిక్కుకున్న కూలీలు..
నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట వద్ద శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు కెనాల్ టెన్నెల్ లో ప్రమాదం చోటు చేసుకుంది.

SLBC Tunnel
SLBC Tunnel: నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట వద్ద శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు కెనాల్ టెన్నెల్ లో ప్రమాదం చోటు చేసుకుంది. 14వ కిలో మీటరు దగ్గర మూడు మీటర్ల మేర టన్నెల్ పైకప్పు కూలిపోయింది. టన్నెల్ లోపల 40 మంది కూలీలు చిక్కుకున్నట్లు సమాచారం. వెంటనే సహాయక చర్యలను చేపట్టారు. ముగ్గురు కార్మికులను సురక్షితంగా బయటకు తీశారు. మిగిలివారిని బయటకు తీసుకొచ్చేందుకు టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పనులను తిరిగి ప్రారంభించింది. నాలుగు రోజుల క్రితమే ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు ప్రారంభం అయ్యాయి. అయితే, పనులు జరుగుతున్న సమయంలో శనివారం ఉదయం టన్నెల్ పైకప్పు కూలింది. అధికారులు ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు కార్మికులకు స్వల్పగాయాలు అయినట్లు తెలుస్తోంది.
సహాయక చర్యలు ముమ్మరం చేయండి.. : సీఎం రేవంత్ రెడ్డి
టన్నెల్ లో పైకప్పు కూలి కార్మికులు గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఘటన నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల వాఖ సలహాదారు, ఇతర అధికారులు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఘటనా స్థలికి బయల్దేరి వెళ్లారు.