ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 105 సీట్లొస్తాయి : కేసీఆర్

ఎగ్జిట్ పోల్స్ గోల్ మాల్ గా మారాయి. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లొచ్చినా ప్రజలతోనే ఉంటామని కేసీఆర్ అన్నారు.

BRS Chief KCR

BRS Chief KCR : బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక దశాబ్ది ఉత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన తెలంగాణ దశాబ్ధి ఉత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్.. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. 1999 కంటే ముందు తెలంగాణ ప్రజలు అనుభవించిన బాధ తలుచుకుంటేనే దుఃఖం వస్తుంది. గతంలో తెలంగాణ కరువు కాటకాలకు, ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేదని కేసీఆర్ అన్నారు. కొంతమంది తమ చిల్లర రాజకీయాల గురించి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేశారు. ఉమ్మడి రాష్ట్రంలో దాస్యం ప్రణయ్ భాస్కర్ అసెంబ్లీలో తెలంగాణ అంటే నాటి స్పీకర్ తెలంగాణ పేరు మాట్లాడవద్దని అన్నారు. తెలంగాణ కోసం జయశంకర్ రాజీలేని పోరాటం చేశారు. తెలంగాణలో ముల్కీ రూల్స్ అమలు అవుతాయని సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఆంధ్రాలో జై ఆంధ్రా ఉద్యమం వచ్చింది. వ్యూహాలు లేకపోవడంతో 1969 తెలంగాణ ఉద్యమం ఫెయిల్ అయింది. సుప్రీంకోర్టు తీర్పును కాలరాసి ముల్కీ రూల్స్ ను ఇందిరాగాంధీ రద్దు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో బతుకమ్మ పండుగ అంటే మోటుగా మారింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ నాయకులు వాళ్ళ జిల్లాల గురించి మాట్లాడలేదు. తెలంగాణ నుండి ముగ్గురు మాత్రమే ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్ళను మధ్యలోనే సీఎం పదవి నుండి దించారు. పీవీ నరసింహారావును మధ్యలోనే దించారని కేసీఆర్ అన్నారు.

Also Read : అందుకే ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీకి తక్కువ సీట్లు వస్తున్నట్లు ఇచ్చారు: సజ్జల

మళ్లీ అధికారంలోకి వస్తాం..
చంద్రబాబు నాయుడు సీఎంగా కేంద్రంలో చక్రం తిప్పుతుంటే నేను తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాను. 2000 సంవత్సరంలోనే తెలంగాణ జెండా పుట్టింది. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ వచ్చింది. 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గులాబీ జెండాకు వుంది. బీఆర్ఎస్ ఖతం అవుతుందని మోకాలు ఎత్తు లేనోడు మాట్లాడుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చాలా చిన్న విషయం. పార్లమెంట్ ఎన్నికల్లో నేను బస్సు ఎక్కుతే ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చింది. మళ్లీ తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 105 సీట్లు వస్తాయని కేసీఆర్ అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా.. హరీశ్ రావునా?
రైతు బంధు ఓట్లకోసం ఇవ్వలేదు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చాం. విష ప్రచారాలు, అడ్డగోలు హామీల వలన 1.8శాతం ఓట్లతో బీఆర్ఎస్ ఓడిపోయింది. తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పుట్టిందని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బాచుపల్లిలో కరెంటుపోతే ప్రజలు రోడ్డెక్కారు. కరెంటు కోతలకు హరీష్ రావు కారణం అని రేవంత్ రెడ్డి పేలవ మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా..? హరీష్ రావు ముఖ్యమంత్రా..? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ డౌన్ అయింది. 4,000 పింఛన్ అని చెప్పి మాట తప్పారు. కాంగ్రెస్ హయాంలో పోలీస్ స్టేషన్‌ల‌ లో ఎరువు బస్తాలు అమ్మారు. ఇప్పుడు మళ్లీ విత్తనాలకోసం చెప్పులు లైన్లలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కల్లు డిపోల మీద దాడులుచేసి కల్లు గీత కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారు. గొర్రెల స్కీంను బంద్ చేశారు. తెలంగాణలో పాలన రివర్స్ అయింది. బీఆర్ఎస్ ను ఓడించడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ప్ర‌భుత్వానికి రీప్లేస్ మెంట్ బీఆర్ఎస్ మాత్రమే. వేరే పార్టీతో ఏం కాద‌ని కేసీఆర్ అన్నారు.

Also Read : సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంట‌ర్.. ఏమ‌న్నారంటే?

ఎగ్జిట్ పోల్స్ గోల్ మాల్ గా మారాయి..
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం మంచి పరిణామం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి విజయం ఖాయం. సీఎం రేవంత్ రెడ్డి సొంత‌ జిల్లాలో బీఆర్ఎస్ గెలిచింది. ఎగ్జిట్ పోల్స్ గోల్ మాల్ గా మారాయి. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లొచ్చినా ప్రజలతోనే ఉంటాం. రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్. కాంగ్రెస్ వాళ్ళతో ఏం కాదు. గెలిచామన్న నమ్మకం కాంగ్రెస్ నేతల్లో లేదు. సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు బుద్ధిఉంటే గత ప్రభుత్వంలో ఎట్లా కరెంటు నడిచిందో అట్లా నడపమని చెప్పలేరా? ఆరు నెలల్లో ఒక్క పాలసీ ప్రకటించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి క్యాబినెట్ లో 42 నిర్ణయాలు తీసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో లొల్లి తప్ప ఏం లేదు. లోగో విషయంలో అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం. నేను ఒక్కడినే నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే రెండు రోజుల పాటు బీఆర్ఎస్ వార్షికోత్సవాన్ని జరుపుకుందాం ఓపిక ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం కోసమే పనిచేస్తాన‌ని కేసీఆర్ అన్నారు.