సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్.. ఏమన్నారంటే?
ఉద్యమంలో ఏనాడు పాల్గొనని వారికి, నోటి నుండి ఒక్కసారికూడా జై తెలంగాణ అని నినదించని వారికి, అమరులకు ఏనాడు నివాళులర్పించని వారికి ...

Harish Rao
Harish Rao Counter To CM Revanth Reddy : మాజీ సీఎం కేసీఆర్ పాకిస్తాన్ వాళ్లలా వ్యవహరిస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరిపితే పాకిస్థాన్ వేడుకలతో పోల్చడం కుసంస్కారానికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనం అంటూ రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారికి, తెలంగాణ గడ్డ మీద ప్రేమ ఉన్నవారికి రాష్ట్ర అవతరణ ప్రాముఖ్యత అర్థం అవుతుంది. ఉద్యమంలో ఏనాడు పాల్గొనని వారికి, నోటి నుండి ఒక్కసారికూడా జై తెలంగాణ అని నినదించని వారికి, అమరులకు ఏనాడు నివాళులర్పించని వారికి ఆ ఆర్తి, ఆ భావోద్వేగం ఎలా అర్థమవుతుందని హరీశ్ రావు అన్నారు.
Also Read : గత పదేళ్లలో స్వేచ్ఛపై దాడి జరిగింది.. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు : సీఎం రేవంత్ రెడ్డి
ఒక్కరోజు ముందుగా ఉత్సవాలు జరపడం కాదు, ఏడాది పొడుగునా పండుగగా దశాబ్ది ఉత్సవాలను మా ప్రభుత్వం నిర్వహించే ప్రణాళిక చేశాం. 2023 జూన్ 2వ తేదీ నుండి 21 రోజులపాటు జరిపిన ఉత్సవాలలో ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద కళాకారులతో ప్రదర్శనలు, నృత్యం, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. జూన్ 2న జెండా ఆవిష్కరణతో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమై, జూన్ 22న అమరుల సంస్మరణతో ముగించాం. స్వతంత్ర పోరాటాన్ని చూడని నవతరం, తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని చూసింది. ప్రత్యక్షంగా పాల్గొంది. ఆ ఆర్తి ఉంది కాబట్టే, 2023లో బీఆర్ఎస్ నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు విజయవంతమయ్యాయి. నిన్న గన్ పార్కు వద్ద నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని మరోసారి విజయవంతం చేశారు.
Also Read : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాహుల్
ఇవన్నీ ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన వారికి ఎలా అర్థం అవుతాయి. అందుకే కేసీఆర్ జూన్ 1వ తేదీ సాయంత్రం నిర్వహించిన క్యాండిల్ లైట్ ర్యాలీ, సంబరాలు పాకిస్తాన్ అవతరణలా రేవంత్ రెడ్డికి అనిపించాయంటూ హరీశ్ రావు అన్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు భూపేష్ భాగెల్ కూడా మూడు రోజుల రాష్ట్ర అవతరణ ఉత్సవం జరిపారు. అంటే, పాకిస్థాన్ లో ఒక రోజు ముందు స్వతంత్ర దినోత్సవం జరపడం అన్నట్లే నా భూపేష్ భాగెల్ మూడు రోజుల సంబరాలు అని హరీశ్ రావు ప్రశ్నించారు.