×
Ad

అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు.. వారి మాటలను తూకం వేస్తే 24 క్యారెట్ల అబద్ధం వస్తుంది: రేవంత్ రెడ్డి

"ఇప్పటివరకు అన్ని ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖర్ రావు గుర్తించారు. అందుకే బయటికి వచ్చి మళ్లీ జల వివాదం రేపుతున్నారు" అని అన్నారు.

Revanth Reddy, K Chandrashekar Rao (Image Credit To Original Source)

  • ఎన్నికల్లో బీఆర్ఎస్‌ గెలవట్లేదు
  • బీఆర్ఎస్ మనుగడనే కష్టమవుతుందని కేసీఆర్ గుర్తించారు
  • అందుకే మళ్లీ జల వివాదం రేపుతున్నారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ అబద్ధాల సంఘాన్ని ఏర్పాటుచేసుకుని, స్వచ్ఛమైన 24 క్యారెట్ల అబద్ధాలు చెబుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మళ్లీ జలవివాదం రేపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

నీటి వాటాలపై ఇటీవల కేసీఆర్ విమర్శలు గుప్పించడంతో ఇవాళ ప్రజాప్రతినిధులకు అవగాహన కోసం ‘నీళ్లు-నిజాలు’ పేరిట ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

“బీఆర్ఎస్‌ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడూ ఆ పార్టీకి రాలేదు. ఆ తర్వాత కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నిక, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక.. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడా కూడా పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు.

ఓటమి తప్ప ఆ పార్టీకి ఏమీ కనిపించలేదు. ఇప్పటివరకు అన్ని ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖర్ రావు గుర్తించి బయటికి వచ్చి మళ్లీ జల వివాదం రేపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు నేను సహకరిస్తున్నానని ఒక అపోహను ప్రజల్లో కల్పించాలనుకుంటున్నారు. ఇటువంటి పనులు చేసి తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలే వస్తున్నాయి. వాటిని తూకం వేస్తే 24 క్యారెట్ల అబద్ధం వస్తుంది” అని అన్నారు.

ముఖ్యంగా నీళ్ల హక్కుల కోసమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో నీళ్ల విషయంలో ఎన్నో పొరపాట్లు జరిగినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ఆ పొరపాట్లను సరిదిద్దుతూ ముందుకు వెళుతోందని అన్నారు.