MLC Kavitha
BRS Candidates 1st List: తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల ముఖ్యనేతలు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిసింది. అయితే, సోమవారం ప్రకటించే తొలి జాబితాలో దాదాపు 90 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో తొలి జాబితాను విడుదల చేసే క్రమంలో టికెట్ రాదని భావిస్తున్నవారు, ఆశావహులు ఎమ్మెల్సీ కవిత నివాసానికి క్యూకట్టారు. మరికొందరు మంత్రి హరీష్ రావు వద్ద తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని కోరుతూ విజ్ఞప్తులు చేసుకున్నారు. అయితే, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత తమ వద్దకు వచ్చిన విజ్ఞప్తులతో ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ విడుదలచేసే తొలి జాబితాలో పలు నియోజకవర్గాల్లో పేర్లు మారే అవకాశం ఉంది. మరోవైపు తీవ్రపోటీ ఉన్న నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ తొలి జాబితా విడుదలవుతుందన్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసం వద్దకు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆశావహులు చేరుకొని ఆమెతో మాట్లాడారు. కవితను కలిసి వారిలో రేఖా నాయక్, ఎస్. సంజయ్, ముత్తిరెడ్డి, ఎల్. రమణ, సునీతా లక్ష్మారెడ్డితో పాటు బొంతు రామ్మోహన్, చంద్రావతి ఉన్నారు. వీరితో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్సీ కవితను కలిసిన వారిలో ఉన్నారు. మరోవైపు మంత్రి హరీష్ రావుసైతం పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న ఆశావహులు కలిశారు. వారి విజ్ఞప్తులను మంత్రి స్వీకరించినట్లు తెలిసింది.
మరోవైపు సీఎం కేసీఆర్ మొదటి జాబితాలో ఎన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. 2018 ఎన్నికల సమయంలో మొదటి జాబితాలో 105 నియోజకవర్గాల అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ దఫా 90 నుంచి 100 నియోజకవర్గాల్లో తొలిజాబితాలో అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎవరి పేరు గల్లంతవుతుందోనని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.