కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించింది, మాకే ఎక్కువ సీట్లు వస్తాయి- లోక్‌సభ ఎన్నికలపై కేటీఆర్

బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి కష్టపడ్డారు. ఆరేడు సీట్లలో రేవంత్ రెడ్డి డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు.

Ktr On Lok Sabha Elections : లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్ఎస్ కే ఎక్కువ సీట్లు వస్తాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని ప్రజలు నమ్మారని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించిందన్నారు. హామీలపై మాట మార్చడంతో కాంగ్రెస్ ను ప్రజలు నమ్మలేదన్నారు.

బీజేపీపైనా ప్రజల్లో సానుకూలత లేదన్నారు. బీజేపీ వల్ల ఒరిగిందేమీ లేదని ప్రజలకు అర్థమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిత్యవసరాలు, సిలిండర్ల ధరలు పెరగడంతో బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని వివరించారు. కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించిందన్న కేటీఆర్.. గ్రామాల్లో బీఆర్ఎస్ కు మద్దతు పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

”దాడులు, కేసులు, కుట్రలను తిప్పికొట్టాం. 50శాతం సీట్లు బీసీ అభ్యర్థులకు కేటాయించి బీఆర్ఎస్ న్యాయం చేసింది. సీనియర్లు, బలమైన నాయకులకు మేము టికెట్లు ఇచ్చాము. చివరి నిమిషంలో వచ్చిన పారాచ్యూట్ లీడర్లకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ధీటుగా పోటీ ఇచ్చింది. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నట్లుగా కాంగ్రెస్, బీజేపీ వ్యవహారం ఉంది. ఆరేడు సీట్లలో రేవంత్ రెడ్డి డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు. బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి కష్టపడ్డారు” అని కేటీఆర్ విమర్శించారు.

”కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. మేము చేసిన పనులన్నింటిని తిరగదోడి, కొత్త జిల్లాలను రద్ద చేయాలని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తెచ్చిందని మేము అనుకుంటున్నాం. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, 420 హామీలు ఇచ్చి.. ఇవాళ వాటిని తుంగలోకి తొక్కిన వైనంపై కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత గ్రామాల్లో స్పష్టంగా కనిపించింది. రైతు భరోసా అని చెప్పి మోసం చేసినందుకు, రైతుబంధు ఇవ్వనందుకు, కరెంట్ విషయంలో తీవ్రమైన నష్టం చేసినందుకు, క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామని మోసం చేసినందుకు రైతులు భగ్గున మండుతున్నారు. తప్పకుండా ఆ వ్యతిరేకత అన్నది ఓట్ల రూపంలో గ్రామీణ ప్రాంతాల్లో కనిపించింది.

రుణమాఫీ పై మాట, తేదీలు మార్చిన విధానం కాంగ్రెస్ ను నమ్మలేని పరిస్థితిని తీసుకొచ్చింది. రైతాంగం అంతా ఒక్కటే అనుకున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని అనుకున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటర్లు బుద్ధి చెప్పారని భావిస్తున్నాం. మహిళల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది. మహిళలకు 100 రోజుల్లోనే నెలకు 2వేలు ఇస్తామని మాటిచ్చారు, కానీ ఆ హామీ నేరవేర్చలేదు. తులం బంగారం, స్కూటీలు, 4వేల పెన్షన్ అని పెద్ద పెద్ద మాటలు చెప్పి మోసం చేశారు. అందుకే కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగింది” అని కేటీఆర్ అన్నారు.

Also Read : రేవంత్ రెడ్డికి ఆగస్టులో రాజకీయంగా పెను ప్రమాదం: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

ట్రెండింగ్ వార్తలు