BRS leader Jagdish Reddy
Jagadeesh Reddy : పార్టీ మారిన ప్రజాద్రోహులు తమ సభ్యత్వాన్ని కోల్పోవడం ఖాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి అన్నారు. నల్గొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కాళోజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి జగదీష్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్యలు పాల్గొన్నారు. అనంతరం జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు.
Also Read : నాలుగు వారాలు టైం ఇస్తున్నాం..! తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు
గడువు విధించి ఆ లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడం శుభ పరిణామం. పార్టీ మారిన ప్రజా ద్రోహులు తమ సభ్యత్వాన్ని కోల్పోవడం ఖాయం, ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్న రేవంత్ సర్కార్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు ఉప ఎన్నికలు ఆయుధం కానున్నాయని జగదీశ్ రెడ్డి అన్నారు.
చెరువులు, వాటి ఎఫ్టీఎల్ లను గుర్తించి ఆక్రమణలు తొలగించాలి.. అంతేతప్ప.. ఆక్రమణ పేరుతో ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే ఊరుకోం. పేదల జోలికి వస్తే సహించేది లేదు. పేదల తరపున నిలబడతాం.. అండగా పోరాడతామని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.