Site icon 10TV Telugu

MLC Kavitha Suspension : బీఆర్ఎస్ అధిష్టానం సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ వేటు

MLC Kavitha Suspension

MLC Kavitha Suspension

MLC Kavitha Suspension : బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ మహిళా నేత, ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం లేఖను విడుదల చేసింది. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సోమా భారత్, రవీందర్ రావు పేరుతో కవితపై సస్పెన్షన్ వేటుకు సంబంధించిన లేఖ విడుదలైంది.

ఇటీవలి కాలంలో ఎమ్మెల్సీ కవిత పార్టీ పట్ల ప్రవర్తిస్తున్న తీరు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని, పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ కవిత అంశం కొద్దికాలంగా బీఆర్ఎస్ పార్టీలో కలకలం సృష్టిస్తుంది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల నుంచి కవితకు పార్టీ అధిష్టానంకు మధ్య గ్యాప్ మొదలైంది. కేసీఆర్ ప్రసంగంపై పలు అంశాలను ప్రస్తావిస్తూ కవిత లేఖ రాశారు. ఆ లేఖ బయటకు రావడంతో కవిత పార్టీలోని కొందరు నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్ని రేపాయి. ఆ సమయంలోనే కవితపై చర్యలు తీసుకోవాలని పార్టీలోని పలువురు సీనియర్ నేతలు కేసీఆర్ కు సూచన చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజాగా.. హరీశ్ రావు, సంతోష్ రావులను ఉద్దేశించి కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో కేసీఆర్ కు అవినీతి మరక అంటడానికి హరీశ్ రావు, సంతోష్ రావులే కారణమంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. పార్టీలోని ముఖ్యనేతలు, జిల్లా, మండల స్థాయిలోని నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తరువాత కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

కేసీఆర్ తాజా నిర్ణయంతో.. ఇన్నాళ్లూ కవిత విషయంలో ఎలా స్పందించాలో తెలియక తర్జనభర్జనలో ఉన్న పార్టీ నేతలకు ఓ క్లారిటీ వచ్చినట్లయింది. ఇక నుంచి కవిత వ్యాఖ్యలను బట్టి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా సీరియస్‌గా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Exit mobile version