MLA Bollam Mallaiah Yadav
Venkatreddy vs Mallaiah Yadav: తెలంగాణ (Telangana) రాజకీయాలను టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యలు కుదిపేస్తున్నాయి. ఉచిత విద్యుత్ (Free electricity) పై రేవంత్ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. అమెరికా పర్యటనలో ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయానికి 8గంటల సేపు నాణ్యమైన విద్యుత్ ఇస్తే చాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ (BRS) నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే 24గంటల ఉచిత విద్యుత్ తొలగిస్తుందంటూ మండిపడ్డారు. దీనికితోడు మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్దం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ నేతల వాదనను తిప్పికొట్టారు. రేవంత్ వ్యాఖ్యలను తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవాలని బీఆర్ఎస్ చూస్తుందంటూ విమర్శించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. పది గంటల విద్యుత్ ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ నిరూపిస్తే సబ్ స్టేషన్‌లోనే రాజీనామా చేస్తానని అన్నారు. అంతేకాదు, నా జీవితాంతం బీఆర్ఎస్‌కు సేవ చేస్తానంటూ సవాల్ చేశారు. దమ్ముంటే బీఆర్ఎస్ నేతలు నా సవాల్‌ను స్వీకరించాలని వెంకట్ రెడ్డి సవాల్ చేశారు.
Revanth Reddy : 24గంటల ఉచిత విద్యుత్.. పక్కా మోసం- సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్‌కు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సై అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేక పోతున్నారని మల్లయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్‌ను నేను స్వీకరిస్తున్నానని, తన పరిధిలోని మునగాల సబ్ స్టేషన్‌కు వస్తే నిరూపిస్తానంటూ 10టీవీ డిబేట్‌లో ప్రతిసవాల్ విసిరారు. గురువారం ఉదయం 9గంటలకు మునగాల సబ్‌స్టేషన్‌కు వచ్చి కూర్చుంటానని ఎమ్మెల్యే చెప్పారు.
తన సవాల్‌ను స్వీకరిస్తే కాంగ్రెస్ ఎంపీలు, నేతలు మునగాల సబ్ స్టేషన్‌కు రావాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సవాల్ చేశారు. ప్రజల సమక్షంలోనే కాంగ్రెస్ నేతల తీరును ఎండగడతామని అన్నారు. కాంగ్రెస్ నేతలు వచ్చినా రాకున్నా నేను 9గంటలకు మునగాల సబ్ స్టేషన్ కు వస్తానని మల్లయ్య యాదవ్ 10టీవీ డిబేట్‌లో స్పష్టం చేశారు. అయితే, మల్లయ్య యాదవ్ ప్రతి సవాల్‌పై ఇప్పటి వరకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించలేదు.