BRS MLA Harish Rao
Harish Rao: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు.
హరీశ్ రావు మాట్లాడుతూ.. నిన్న కమిషన్ చైర్మన్ సమయం ఇచ్చారు. కేసీఆర్ హాస్పిటల్ లో ఉన్నందున రాలేకపోయా. క్యాబినెట్ నిర్ణయాలు కావాలని సీఎస్, జీఏడీ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీకి లేఖ రాశా. ముగ్గురు నుంచి సరైన సమాధానం రాలేదు. మేడిగడ్డకు ఆరు సార్లు క్యాబినెట్ లో ఆమోదం పొందాయి. మూడు సార్లు శాసనసభలో ఆమోదం పొందాయి. కమిషన్ కు డాక్యుమెంట్లను అందజేశామని హరీశ్ రావు అన్నారు.
కమిషన్ కు మీరు అందించిన సమాచారం ఒక కాపీ ఇవ్వాలని సెక్రటరీని అడిగాను. అసలు కాళేశ్వరం కమీషన్ కు నాటి క్యాబినెట్ వివరాలు సరిగ్గా ఇస్తున్నారా.. లేదా అనేది అనుమానం వస్తుంది. మీరు సరైన వివరాలు ఇస్తే వాటి కాపీ మాకు ఇవ్వాలని కోరుతున్నా. కాపీలు ఇస్తే పారదర్శకంగా ఉన్నట్లు భావిస్తామని హరీశ్ రావు అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫైర్..
అజ్ఞానం, అహంకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే ప్రజలు నిజమని అనుకుంటున్నారు. కృష్ణా బేసిన్ లో 299 టీఎంసీల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని హరీశ్ రావు అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయం ముఖ్యమంత్రి రేవంత్ దాచి పెట్టారు. సెక్షన్ 3 ప్రకారం నీటిని పంపిణీ చేయాలని కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే కేంద్రాన్ని అడిగారు. నీటి పంపకం ట్రిబ్యునల్ చేస్తాది. బోర్డు తాత్కాలిక పద్ధతిన నీటి వాటాలు తెలుస్తుంది. రేవంత్, ఉత్తమ్ కూడా తాత్కాలిక పద్ధతికి ఒప్పుకున్నారు.
రేవంత్ కృష్ణ నది నీటిపై మాట్లాడిన పాత వీడియోలు ఒకసారి చూడండి. ఆయన ఒక్కడే అజ్ఞాని అనుకున్నా.. పైలట్ చదువుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికూడా అలానే మాట్లాడుతున్నారు. మీ మాటలు రాష్ట్రానికి గొడ్డలి పెట్టు. రాష్ట్ర ప్రయోజనాలకోసం మాట్లాడుతున్నారా..? చంద్రబాబు ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు. బేసిన్లు తెలియని ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు.. బేసిక్‌లు తెలియని ఆయన నీటి మంత్రి అయ్యిండు అంటూ హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
54లక్షల ఎకరాలకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నీరు ఇచ్చిందని రేవంత్ చెబుతున్నారు. రేవంత్ తాతల నాటి ప్రాజెక్టులను, నిజాం నాటి ప్రాజెక్టులు మేము కట్టినం అని అంటున్నారు. 16లక్షల ఎకరాలు ఏపీ రాష్ట్రం ఏర్పడక ముందే తెలంగాణకు నీరు అందించారు.
రేవంత్ రెడ్డికి సవాల్..
బీఆర్ఎస్ హయాంలో 48 లక్షల ఎకరాలకు నీరందించాము. కాంగ్రెస్ హయాంలో ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీరందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి అతి తెలివి మాటలు. తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పింది. మహారాష్ట్రతో నీటి లభ్యత గురించి మీ కాంగ్రెస్ ఎనిమిదేళ్లలో ఎందుకు చర్చించ లేదు..? మీ లాగా మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు తీసుకుని ప్రజలను మోసం చేయలేము. రేవంత్ నీకు దమ్ముంటే ఇష్టం వచ్చిన డేట్ పెట్టి అసెంబ్లీ సమావేశాలు పెట్టు. ఇక్కడ ఒక్కటే షరతు.. మైక్ కట్ చేయొద్దు. అసెంబ్లీ వాయిదా వేసుకుని పారిపోవద్దు. అంటూ హరీశ్ రావు సవాల్ చేశారు.