BRS MLA Mainampally
MLA Mainampally : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన రాజకీయ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చారు. నన్నునమ్ముకున్న వారికి నేను న్యాయంచేస్తానని, ఆ మేరకే నా అడుగులు ఉంటాయని చెప్పారు. శనివారం మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసం వద్దకు మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్లతోపాటు అభిమానులు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాబోయే కాలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై అనుచరులతో మైనంపల్లి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మెదక్‌లో బీఆర్‌ఎస్ నేతలు మాతో వారి గోడు చెప్పుకున్నారు. కోవిడ్ సమయంలో నియోజకవర్గ స్థాయిలో నేను ఎంతో సేవ చేశానని అన్నారు. మనిషి ఆశా జీవి, ఉన్నత స్థానాన్ని కోరుకుంటారు. జీవితంలో స్థిర పడడం అనేది ఉండదు.. ఆశలు ఉంటాయి. నేను అమెరికా నుంచి వచ్చి కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నన్ను నమ్ముకున్న వారికి నేను న్యాయం చేస్తాను అని మైనంపల్లి అన్నారు. రాజకీయాల్లో ఉంటే ఎక్కువ సేవ చేస్తానని వచ్చాను. రాజకీయాల్లో నీకు ఇబ్బందులు వుంటాయని ఆనాడే కొంతమంది చెప్పారు. ఉన్నది ఉన్నట్లు చెప్పే నేతను నేనని అన్నారు. మెదక్ ప్రజలు నాకు రాజకీయ భిక్ష పెట్టారు. నేను ఉద్యమ సమయంలో ఎక్కడా రాజీ పడలేదని మైనంపల్లి అన్నారు.
నన్ను వ్యక్తిగతంగా ఇబ్బందులు పెడితేనే నేనూ విమర్శిస్తా. కార్యకర్తలను కలుసుకుంటు ప్రజల మధ్యలో వారంరోజులు ఉంటాను. ప్రజల అభిప్రాయం తెలుసుకుని తుది నిర్ణయం తీసుకుంటానని, వారం తరువాతనే నేను మీడియాకు అన్ని వివరాలు చెబుతానని మైనంపల్లి చెప్పారు. మా కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం మేరకు నా నిర్ణయం ఉంటుందని, ప్రజల మద్దతుతోనే విజయం సాధిస్తానని అన్నారు. ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగా ఉంటానని ఎమ్మెల్యే మైనంపల్లి అన్నారు. నా కొడుకు నా కంటే ప్రజలకు ఎక్కువ సేవలు అందిస్తున్నారు. రాజకీయాల్లో కొడుకులు రావద్దని ఎక్కడా లేదు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని, పార్టీని నేను ఎప్పుడూ విమర్శించలేదని అన్నారు. రేపటి నుంచి యధావిధిగా నా కార్యక్రమాల్లో ఉంటానని మైనంపల్లి చెప్పారు.