BRS protest against singareni privatisation
PM Modi Hyderabad Tour : ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయటానికి సిద్ధమైంది. మోదీ హటావో సింగరేణి బచావో నినాదంతో మహాధర్నా నిర్వహిస్తోంది బీఆర్ఎస్. ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించేందుకు సికింద్రాబాద్ విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ గోదావరిఖని మెయిన్ చౌరస్తా వద్ద మోదీ హటావో సింగరేణి బచావో నినాదంతో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటిగంట వరకు మహాధర్నా చేపడుతోంది. ఈ మహాధర్నాలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సింగరేణిలోని బొగ్గు బ్లాకులను వేలం ద్వారా విక్రయించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయించడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా మండిపడుతోంది. ప్రవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తోంది. దీంట్లో భాగంగా ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా తన నిరసనను వ్యక్తంచేయాలని బీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించింది. దీంట్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా మహాధర్నా చేపట్టారు. రామగుండం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెంలో మహాధర్నాలు చేపట్టారు. శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్‌లపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లిలో చేపట్టిన ధర్నాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. అలాగే కొత్తగూడెంలోను, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తా దగ్గర నిర్వహించిన మహాధర్నాల్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు నిసరనలు వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఈ ప్రవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తుంటే బొగ్గు గనులను ప్రయివేటు పరం చేస్తే ఊరుకోబోమని, కేంద్రంపై జంగ్‌సైరన్ మోగిస్తామని సింగరేణి కార్మికులు భగ్గుమంటున్నారు.