BRS: బీఆర్ఎస్‌లో వరుసగా చేరికలు.. ఎందుకంటే?

వారంలో కనీసం రెండు మూడు నియోజకవర్గాల నుంచి చేరికల కార్యక్రమాలు ఉండేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది గులాబీ పార్టీ. ఈ కసరత్తులో భాగంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఇప్పుడు జాయినింగ్స్‌పై సీరియస్‌గానే కసరత్తు చేస్తున్నారట.

KCR brs

BRS: స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్‌ సన్నాహాలు చేస్తోంది. ఓవైపు లోకల్‌ బాడీ పోల్స్‌పై కసరత్తు చేస్తూనే మరోవైపు ఆ పది సీట్లకు బైపోల్స్ రావొచ్చన్న అంచనాతో ఉంది.

దీంతో ఇదే సరైన సమయమంటూ..కాంగ్రెస్, బీజేపీలోని అసంతృప్త నేతలను కారు ఎక్కిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్న గులాబీ పార్టీ..రాష్ట్రవ్యాప్తంగా గ్రౌండ్ వర్క్ చేస్తోంది.

పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు, ముఖ్య నేతలతో వరుసగా సమావేశమవుతోన్న కేటీఆర్..రాజకీయ పరిణామాలతో పాటు లోకల్ బాడీ పోల్స్‌పై సీరియస్‌గా చర్చిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లో నుంచి నాయకులు, కార్యకర్తల చేరికలపై కేటీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Also Read: బీసీ రిజర్వేషన్లపై ముందుకు వెళ్లలేక.. వెనక్కి తగ్గలేక డైలమా.. ఈ సారి క్యాబినెట్‌ భేటీలో అయినా..

లోకల్ బాడీ పోల్స్ అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.

ఆ ఎలక్షన్స్‌లో ఎక్కువ స్థానాలను గెలవాలంటే గ్రామస్థాయిలో పార్టీ బలంగా ఉండాలని భావిస్తున్న బీఆర్ఎస్..ఆ దిశగా అడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగా పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తోంది గులాబీ పార్టీ. పెద్ద లీడర్లే కాకుండా మండల, గ్రామ స్థాయి నేతలైనా పరవాలేదు గాని.. ప్రతి నియోజకవర్గం నుంచి కచ్చితంగా చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తోంది.

ఇంచార్జీలకు టార్గెట్లు ఇచ్చి మరీ చేరికల జోరు

నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు, ఇంచార్జీలకు టార్గెట్లు ఇచ్చి మరీ చేరికల జోరు పెంచిందన్న టాక్ వినిపిస్తోంది.

వారంలో కనీసం రెండు మూడు నియోజకవర్గాల నుంచి చేరికల కార్యక్రమాలు ఉండేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది గులాబీ పార్టీ.

ఈ కసరత్తులో భాగంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఇప్పుడు జాయినింగ్స్‌పై సీరియస్‌గానే కసరత్తు చేస్తున్నారట.

ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరుతున్నవారిని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు గులాబీ నేతలు.

పెద్ద లీడర్లతో పాటు గ్రామ, మండలస్థాయిలో చిన్నా చితక నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నా నియోజకవర్గాల్లో కాకుండా నేరుగా బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌కు తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు.

అంతే కాకుండా ఇలాంటి చేరికల కార్యక్రమానికి స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు.

ఎంత మంది పార్టీలో చేరినా చాలా ఓపికగా వారందరికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహానికి కారణమవుతోంది.

సమయాన్ని బట్టి కేటీఆర్ చేరికల కార్యక్రమానికి టైమ్‌ ఇస్తుండటంతో చాలా నియోజకవర్గాల నుంచి చేరికలు క్యూలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చేరికలు బీఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఎంతవరకు గట్టెక్కిస్తాయో చూడాలి మరి.