×
Ad

ఒకదాని తర్వాత మరొక ఇష్యూతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు నోటీసులు ఇస్తారా?

అసెంబ్లీ సమావేశాల తర్వాత సిట్ నోటీసులు జారీ చేసి ఆ తర్వాత విచారణకు పిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు.

BRS: అధికారం కోల్పోయినప్పటి నుంచి వరుసపెట్టి ట్రబుల్స్ ఫేస్ చేస్తోంది బీఆర్ఎస్. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణల జరుపుతుండటం గులాబీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించిన రేవంత్ సర్కార్.. ఆ నివేధిక ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో సీబీఐ దర్యాప్తు ఎలాంటి టర్న్ తీసుకుంటుందోనన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.

ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ ఒప్పందాలు, గొర్రెల పంపిణీ స్కీమ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. వీటన్నింటిపైనా విచారణ జరిపిస్తోంది. ఇందులో భాగంగా ఈ కార్ రేస్ వ్యవహారంపై కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతిచ్చింది. ఈ కార్ రేస్ కేసులో మరోసారి కేటీఆర్‌ను విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కేసు ఎటువైపు దారీతీస్తుందన్న ఆందోళన బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంది.

Also Read: రేవంత్‌ “అసెంబ్లీ” స్కెచ్.. కేసీఆర్‌కు సవాల్‌గా మారనుందా? సభకు రావాలంటూ సవాల్ చేస్తున్నది అందుకేనా?

ఇక బీఆర్ఎస్ పార్టీలో పలు అంశాలు వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యంగా కవిత వ్యవహారం కారు పార్టీకి కంట్లో నలుసులా మారిందనే చెప్పొచ్చు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి..వాయిస్‌ మరింత పెంచారు కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలపై అవినీతి ఆరోపణలు, విమర్శలు చేస్తూ..అధికార పార్టీకి అస్త్రాలను అందిస్తుంది. ఇలాంటి ఎన్నో తలనొప్పులు ఉన్న టైమ్‌లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి రావడం ఆసక్తిరేపుతోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణను స్పీడప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతులిచ్చే రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారులు, మాజీ ఇంటెలిజెన్స్ అధికారులను ఇప్పటికే ప్రశ్నించి వారి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ రావుకు నోటీసులు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత సిట్ నోటీసులు జారీ చేసి ఆ తర్వాత విచారణకు పిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఉలిక్కిపడేలా చేస్తోంది.

ఇప్పటికే పదుల సంఖ్యలో సమస్యలతో డైలమాలో ఉన్న గులాబీ పార్టీకి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు, నోటీసులు అంటూ జరుగుతున్న ప్రచారంతో మరింత ఆందోళనకు గురవుతోందట. ఇలా వరుస కేసులు, విచారణలతో పాటు పార్టీలో అంతర్గతంగా నెలకొన్న పరిస్థితుల పట్ల బీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ నైరాశ్యంలో కూరుకుపోతున్నారన్న చర్చ జరుగుతోంది. పైకి ఇవన్నీ కామనే అని కీలక నేతలు చెబుతున్నా.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పార్టీ కార్యకర్తలు మాత్రం కంగారు పడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.