కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డే కాదు.. కేటీఆర్ వివరణ

తెలంగాణ రైతాంగానికి కామధేనువు, తెలంగాణకు జీవధార.. కాళేశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ktr clarification on kaleshwaram project

KTR on Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలను కాంగ్రెస్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డే అన్నట్టు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రైతాంగానికి కామధేనువు.. తెలంగాణకు జీవధార కాళేశ్వరం అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ దీన్ని పూర్తి చేశారని చెప్పారు. మార్చి 1న చలో మేడిగడ్డ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరిస్తామన్నారు.

”కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తెలిసీ తెలియక కొంతమంది మాట్లాడుతున్నారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నెల్స్, 1700 కిలోమీటర్ల కాలువలు. అన్నింటికి మించి 40 లక్షల పైచిలుకు ఎకరాలకు నీరిచ్చే కామధేనువు కాళేశ్వరం. తెలంగాణ రాష్ట్రానికి జీవధార. ఇదేమి సింపుల్ ప్రాజెక్ట్ కాదు. కాళేశ్వరంపై ఎటువంటి విచారణకైనా సిద్ధం. గతేడాది అత్యధిక వరదను తట్టుకుని మేడిగడ్డ నిలబడింది. నిర్వహణ లోపం కారణంగానే నష్టం జరిగింది. ఏం జరిగిందనేది విచారణలో తేలుతుంది.

రాజకీయ వైరుధ్యాలు, పంతాలు పక్కనపెట్టి ప్రాజక్టుకు తక్షణమే మరమ్మతులు చేయించాలి. కనీసం ఒక్క పంపు అయినా స్టార్ట్ చేసి నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాపై కోపాన్ని రైతులపై చూపొద్దు. సోషల్ మీడియాలో చిల్లర ప్రచారం మానుకోవాలి. నిజంగా రైతులపై నిజంగా ప్రేమ ఉంటే వెంటనే ప్రాజెక్టుకు మరమ్మతు చేయాలి. సాగు, తాగు నీటి కొరత రాకుండా చూడాలి. మార్చి ఒకటో తారీఖున మేమంతా మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శిస్తాం. కాళేశ్వరం సమగ్ర స్వరూపాన్ని అందరికీ చూపిస్తామ”ని కేటీఆర్ అన్నారు.

Also Read: రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ఎన్నికల ముందే ప్రకటిస్తే ఇలా జరిగి ఉండేది: కాంగ్రెస్ నేత సంపత్

ట్రెండింగ్ వార్తలు