Ktr: విషనాగులతో జాగ్రత్త.. 2028లో మళ్లీ కేసీఆర్ సీఎం.. మలేషియా వేదికగా కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
కాలం కలిసిరానప్పుడు వానపాములు కూడా నాగుపాములై బుసకొడతాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు కేటీఆర్(Ktr).
- V Santhosh Kumar
- Published on- June 6, 2026 / 09:34 PM IST
BRS Working President KTR sensational comments in Telangana Formation Day celebrations at Malaysia
- 2028లో మళ్లీ కేసీఆర్ సీఎం
- ఆ విషనాగులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
- 24 గంటల మంచినీరే మా విజన్
Ktr: మలేషియా తెలుగు అసోసియేషన్, బీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ సంబరాల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖండాలు దాటినా మాతృభూమి సంస్కృతిని మరిచిపోకుండా వేడుకలు జరుపుకుంటున్న ఎన్నారైలను అభినందించారు. తెలంగాణ చరిత్ర, బతుకమ్మ వంటి విశిష్ట సంస్కృతిని గుర్తుచేస్తూ ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలుగా సగర్వంగా చెప్పుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులు తెలియని కొందరు నాయకులు తెలంగాణ అభివృద్ధిపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, కాలం కలిసిరానప్పుడు వానపాములు కూడా నాగుపాములై బుసకొడతాయని విమర్శించారు. ఇలాంటి విషనాగులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, 2028లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Ap Rain Alart: ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు.. ఈ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు
మలిదశ ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో నడిపి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌దేనని కేటీఆర్ స్పష్టం చేశారు. వలసల తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మార్చడమే కాకుండా, మలేషియా తరహాలోనే పామాయిల్ విప్లవాన్ని తెచ్చి రాష్ట్రాన్ని ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిపినట్లు గుర్తుచేశారు. గత కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలతో అల్లాడిన రాష్ట్రానికి తాము 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ను అందించగలిగామని వివరించారు.
భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా ప్రతి ఇంటికీ 24 గంటల పాటు స్వచ్ఛమైన మంచినీటిని నిరంతరం సరఫరా చేయడమే తమ ప్రధాన విజన్ అని కేటీఆర్(Ktr) ప్రకటించారు. దీనితో పాటు ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, తెలంగాణను తిరిగి అభివృద్ధి పథంలో నిలిపే శక్తి ఒక్క కేసీఆర్‌కే ఉందని స్పష్టం చేశారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఎన్నారైలు స్థానిక సంస్కృతితో కలిసిమెలిసి సాగుతూ విజయాలు సాధించాలని, రాష్ట్ర ప్రగతి కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
